కరోనాకు పుట్టిల్లు అయిన చైనాను మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండడం చైనా వాసులను ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని అనేక ప్రాంతాల్లో, డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. చైనా వాయువ్య ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియాలోని ఐజిన్ కౌంటీలో పూర్తి లాక్ డౌన్ విధించారు. సోమవారం నుండి ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. ఐజిన్ జనాభా 35,700 మంది ఉండగా.. కోవిడ్ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఏజిన్ కరోనా హాట్ స్పాట్‌గా ఉంది. గత వారం ఇక్కడ 150 మందికి పైగా వైరస్ సోకింది.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు వారంలో కోవిడ్ వ్యాప్తి 11 రాష్ట్రాల్లో తీవ్రతరం అవుతుందని హెచ్చరించింది. సోమవారం ఇన్నర్ మంగోలియాలో 38 కోవిడ్ కేసులను కనుగొన్నారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో చైనా రాజధాని బీజింగ్ లోను ఆంక్షలు తీవ్రతరం చేశారు. బీజింగ్ సహా ఇన్నర్ మంగోలియా, గాన్సు, నింగ్జియా, గుయిజౌలలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: గులాబీ దళపతిగా కేసీఆర్.. 9వసారి అధ్యక్షుడిగా ఎన్నిక