Tuesday, November 26, 2024

డొక్లామ్ లో చైనా ఆవాసాలు….

న్యూఢిల్లి: డొక్లామ్‌ పీఠభూమికి అత్యంత సమీపంలో భూటాన్‌ దేశానికి చెందిన అమో చూ నదీ లోయలో వేలాదిగా సైనిక పటాలాల కోసం చైనా భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడంపై భారత సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. అమో చూ నదీ లోయలో చైనా చేపట్టిన కమ్యూనికేషన్‌ టవర్లతో పాటుగా ఆవాసాల నిర్మాణాలు భారత్‌కు చెందిన సిలిగురి కారిడార్‌ను చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) లక్ష్యంగా చేసుకోవడానికి ఉపకరిస్తాయనే ఆందోళ నలో భారత సైన్యం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతం భారత్‌-చైనా-భూటాన్‌ డొక్లామ్‌ ట్రై జంక్షన్‌కు కొద్ది దూరంలో మాత్రమే ఉండటం గమనార్హం. సరిగ్గా ఇక్కడే చైనా చేపట్టిన రహదారి నిర్మాణంపై చైనా, భారత్‌ సైనిక బలగాల మధ్య 2017లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.

అందుబాటులో ఉన్న తాజా చిత్రాల ప్రకారం అమో చూ నదీ లోయలో పీఎల్‌ఏ ట్రూప్‌ల కోసం దాదాపు 1,000 శాశ్వత నివాసాలు, అనేక తాత్కాలిక షెడ్లు గత కొద్ది మాసాల్లో నిర్మితమయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డొక్లామ్‌కు పశ్చిమంగా చైనా నియంత్రణలోని భూటాన్‌ భూభాగంలో చైనా చేపట్టే ఏదేని కార్యకలాపాలు భారత్‌ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తాయని భారత్‌ సైన్య వ్యూహకర్తలు భావిస్తున్నారు. డొక్లామ్‌ పీఠభూమిపై చైనా పట్టు సాధించిన పక్షంలో అది చైనాకు వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుందనేది భారత్‌ భద్రతానిపుణుల అభిప్రాయం. భూటాన్‌ దేశంలోని హా జిల్లాలో భూటాన్‌ సైన్యం కోసం నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న భారత్‌ అధికారులతో భారత్‌ సైన్యానికి చెందిన అగ్ర శ్రేణి అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. చైనా భారీ ఎత్తున చేపట్టిన నిర్మాణాలు సదరు సమావేశంలో చర్చకు వచ్చాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తున్న వివాదాస్పద భూభాగాలకు తూర్పున హా జిల్లా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement