వరంగల్, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : హృద్రోగంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు త్వరలోనే నిర్వహిస్తామని ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. శనివారం కాకతీయ మెడికల్ కళాశాల లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం, జిల్లా ఎర్లీఇంటర్ వెన్షన్ సెంటర్ సహకారం తో హృద్రోగ వైద్య శిబిరం నిర్వహించారు. హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. లలితాదేవి ముఖ్య అతిథిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ గోపాల్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీతా లక్ష్మీ, కార్డియాలజీ విభాగం హెచ్ వోడీ, డాక్టర్ మమతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన 98 మంది పిల్లలకు ఈ సీజీ, 2డీఎకో పరీక్ష లు నిర్వహించారు. వారిలో 25 మంది ని శస్త్రచికిత్సల నిమిత్తం ఎంపిక చేశారు. వారందరికి వారం రోజుల్లో కార్డియాలజీ విభాగం హెచ్ వోడీ ఆధ్వర్యంలో మెడికల్, శస్త్రచికిత్సలు పూర్తి చేస్తామని ఎంజీయం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ మాట్లాడుతూ కార్డియాలజీ తో పాటు మిగితా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే విధంగా నోడల్ అధికారి తో కలసి చేపడతామని చెప్పారు. ఇంకా ఈ శిబిరం లో డాక్టర్ సనత్ రోషన్, డాక్టర్ రోహన్ వెంకట్, డాక్టర్ శ్రీలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు