ప్రపంచాన్ని రెండోసారి కరోనా గడగడా లాడిస్తోంది . మనదేశం సైతం దీనికి వణికిపోతోంది. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి చిన్నపిల్లల పై ప్రభావం చూపిస్తోంది. మొదటి విడతలో పెద్దగా ప్రభావితం కాకపోయినా, రెండో విడతలో పిల్లలు, కౌమార దశలో ఉన్న వారు చాలా మంది కొత్త కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఒకటి నుంచి ఎనిమిదేళ్ల వయసు ఉన్నవారు, పదేళ్ల పై బడిన పిల్లలు చాలా మంది కరోనా పాజిటివ్ గా తేలుతున్నారు. చాలా తేలికపాటి లక్షణాలున్నా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. మొదటి విడతలో గతేడాది ఒక శాతం మంది పిల్లలు కరోనా వల్ల ప్రభావితం అయితే ఈ సారి 1.2 శాతం మంది ప్రభావితం అవుతున్నారు. సంఖ్యాపరంగా చూస్తే కర్నూలులో చాలా పెద్ద పెరుగుదల కనిపిస్తోంది.
చిన్న పిల్లలకు ప్రత్యేకంగా కోవిడ్ వ్యాక్సిల్ లేదు. కానీ దీనికి సంబంధించి, కౌమార దశలో ఉన్న వారిపై, పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అదే విధంగా పిల్లలకు కరోనా వస్తే అనుసరించాల్సిన విధివిధానాలను ఇంకా మన దేశంలో రూపొందించడం జరగలేదు. కరోనా వైరస్ డబుల్ మ్యూటంట్, కొత్తగా వస్తున్న వైరస్ స్ట్రెయిన్లలో పిల్లలకు సోకే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా బయటకు వెళ్లే పిల్లలు, కోవిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండని వారిలో రెండో దశలో ఎక్కువగా వైరస్ సోకుతోంది. ముఖ్యంగా డబుల్ మ్యూటంట్ లో రోగనిరోధక కారకాలను తప్పించుకునే సామర్థ్యం ఉంది. ఈ వైరస్ మన శరీర కణం లాగానే వ్యవహరించి, రోగనిరోధక శక్తుల బారినుంచి తప్పించుకుంటుంది. అందుకే రెండో విడతలో పిల్లల్లో ఎక్కువగా కోవిడ్ సోకడం కనిపిస్తోంది.
రెండో విడతలో అర్థమౌతున్నదేమిటంటే కోవిడ్ లక్షణాలు కేవలం శ్వాసకోశానికి మాత్రమే పరిమితం కావడం లేదు. పిల్లల్ల్లో ఎక్కువగా తీవ్ర జ్వరం, చలి, ఊపిరి అందకపోవడం, దగ్గు, వాసన తెలియకుండా పోవడం, గొంతు గరగర, మియాల్జియా, గొంతు నొప్పి, మంట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లల్లో జీర్ణ కోశ సంబంధితమైమైన ఆకలి నశించడం, వాంతులు, విరేచనాల వంటి లక్షనాలు కూడా కనిపిస్తున్నాయి. పలు దేశాల్లో కోవిడ్ 19 వల్ల పాంక్రియాటిస్, కాలేయ సమస్యలకు కూడా దారితీస్తుననట్టు తెలుస్తోంది. ఇప్పటికి క్లినికల్ అనుభవాల్లోనే ఈ విషయాలు బయటపడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మంట పెరగడం, వేగంగా ఊపిరి పీల్చడం, బద్ధకం, బిగుసుకుపోవడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలని, తద్వారా పిల్లల్లో కోవిడ్ ను త్వరగా గుర్తించడం సాధ్యమౌతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మామూలుగా శ్వాసకోశ సంబంధిత లక్షణాలనే ఎక్కువగా గుర్తించడం జరుగుతుంది. కానీ నలభై నుంచి యాభై శాతం పిల్లల్లో జీర్ణ కోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తున్నాయి. కొత్త కరోనా వైరస్ ఏసీఈ 2 నే వైరల్ రిసెప్టర్ రూపంలో జీర్ణకోశంలోకి ప్రవేశిస్తోంది. గాస్ట్రిక్, జీర్ణ నాళం, మలద్వారపు అంగర్గత చర్మం పొరలలోని కణాలలో ఇది చేరుకుని, కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ కు కారణం అవుతోంది. కరోనా లక్షణాలున్న పిల్లలను పధ్నాలుగు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ చేయడం తప్పనిసరి. తేలికపాటి లక్షణాలుండి, 94 శాతం వరకూ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే సానుకూల సేవలను అందిస్తూ, పోషకాహారాన్ని ఇస్తూ పారాసిటమాల్ వంటి మందులను అందించాలి . ఒకవేళ్ల సీ రియాక్టివ్ ప్రోటీన్, రక్తంలో ఇనుమును కలిగి ఉండే ఫెర్నిటిన్ ప్రోటీన్ల మోతాదు పెరిగితే మాత్రం పిల్లలను ఆస్పత్రిలో చేర్పించాల్సి ఉంటుంది. స్పష్టమైన చికిత్సా విధానం లేని కారణంగా సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం వంటి విదానాలను ఖచ్చితంగా పాటించడం ఈ పిల్లలకు చాలా అవసరం.
ఇప్పటి వరకూ 18 ఏళ్ల లోపు వయసున్న వారికి ఇచ్చేందుకు వ్యాక్సిన్లను రూపకల్పన చేయడం జరగలేదు. అయితే పిల్ల్లల్లో ప్రభావవంతంగా పనిచేసే వ్యాక్సిన్ల విషయంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ప్రఖ్యాత చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి ఎస్ రామప్రసాద్ చెప్పారు. ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ జాతీయ ఔషధ నియంత్రణ విభాగం నుంచి అయిదు నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న వారిపై కోవాక్సిన్ వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం అభ్యర్ధించడం జరిగింది. ఇప్పటి వరకూ పెద్దలలో ప్రభావం విషయంలోనే సరైన వివరాలు లేనందున అనుమతిని ఇవ్వడానికి నిరాకరించారు.
ఇటీవల ఫైజర్ 12- 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై వ్యాక్సిన్ వంద శాతం ప్రభావం చూపించిందని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగనిరోధక శక్తిని చూపించిందని ప్రకటించింది. అది ఈ వయస్సు లోని పిల్లలపై వ్యాక్సిన్ ను ప్రయోగించేందుకు అమెరికా ఆహార ఔషధ నిర్వహణ విభాగం నుంచి అత్యవసర అనుమతిని కోరింది. అదే విధంగా పిల్లలు, టీనేజర్లలో ఆస్ట్రజెనికా సంస్థ కోవిషీల్డ్ పేరుతో దేశంలో తయారుచేసిన వ్యాక్తిన్ ను యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ సాయంతో పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న పెద్దవారిలో రక్తం గడ్డకట్టుకుపోతున్న లక్షణాల నేపథ్యంలో ఈ పరిశోధనలను నిలుపు చేసింది. గర్భిణుల నుంచి నవజాత శిశువులకు కోవిడ్ వైరస్ సోకిన కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. పిల్లలు పుట్టీ పుట్టగానే కోవిడ్ సోకే అవకాశాలున్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టయితే చాలా తేలికపాటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కొన్ని సార్లు అసలు ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. వారు చాలా త్వరగా కోలుకోవచ్చు. అయితే కొన్ని కేసులు చాలా తీవ్రంగా మారిన సందర్భాలూ ఉన్నాయి .