ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇవ్వాల (శనివారం) కొద్ది సేపటి క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 25 మంది చనిపోయారు. రోడ్డుపై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో 11 మంది చిన్నారులు, 11 మంది మహిళలు సహా 25 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాత్రికులతో ట్రాక్టర్ ట్రాలీ ఉన్నావ్ నుంచి తిరిగి వస్తోంది. కాన్పూర్ జిల్లాలోని ఘతంపూర్ ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడి ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కాగా, కాన్పూర్‌లో జరిగిన ట్రాక్టర్-ట్రాలీ దుర్ఘటనపై ప్రధాని కార్యాలయం నుంచి ట్వీట్ ద్వారా సమాచారం వచ్చింది. ఈ విషయంలో తాను ఎంతో బాధపడ్డానని ప్రధాని చెప్పారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పీఎంవో కోరింది. మరణించిన ప్రతి ఒక్కరికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్టు పీఎంవో తెలిపింది.. గాయపడిన వారికి రూ. 50,000 అందించనున్నారు .
ఇక.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఓ ట్వీట్ చేశారు.. “కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా హృదయ విదారకం.. జిల్లా మేజిస్ట్రేట్, ఇతర సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించాం. క్షతగాత్రులకు సరైన చికిత్స, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని ట్వీట్ చేశారు.