Monday, October 21, 2024

Child Trafficking కడుపున మోయకున్నా కంటికిరెప్పలా చూసుకున్నాం .. బిడ్డల్ని మా నుంచి దూరం చేయొద్దు

క‌న్నీరుమున్నీరైన త‌ల్లిదండ్రులు
పిల్ల‌ల‌ను కొన‌డం నేరం అన్న పోలీసులు
చిల్డ్రెన్ ట్రాఫికింగ్ ముఠా నుంచి ఆధారాలు
16 మంది చిన్నారుల జాడ గుర్తింపు
శిశు విహార్‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు
ప‌ద్ద‌తి ప్ర‌కారం ద‌త్త‌త తీసుకోవాల‌ని సూచ‌న‌
రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో క‌న్నీటి వేద‌న‌

అమ్మతనానికి నోచుకోలేని మహిళలు పడే వేదన ఊహించలేనిది. నేటి సమాజంలో ఇరుగుపోరొగు వారి సూటిపోటి మాటలను త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి వారిలో కొంత‌మంది పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. వారిచేత అమ్మా అని పిలిపించుకుంటూ సంతోషపడుతారు. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని నిరూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇత‌ర రాష్ట్రాల నుంచి పిల్ల‌ల‌ను దొంగ‌త‌నంగా తీసుకొచ్చి.. అమ్మ‌కానికి పెట్టిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని మేడిప‌ల్లిలో వెలుగుచూసింది. ఈ ముఠాని పోలీసులు అరెస్టు చేయ‌డంతో దాని వెన‌కాల ఉన్న వారంతా ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. కాగా, వారి నుంచి పిల్ల‌ల‌ను కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.
గుండెల‌ను మెలిపెట్టే ఘ‌ట‌న‌..

- Advertisement -

ఇన్నాళ్లూ కంటికిరెప్పలా కాపాడుకున్న తమ పిల్లలు దూరమైతే ఆ తల్లి గుండె ఎంతలా రోదిస్తుంది. రోజూ తన గుండెలపై తన్నుతూ కేరింతలు కొట్టే చిన్నారిని ఇక తాము చూడలేమనే ఊహ ఆ తండ్రిని ఎంతలా కుంగిదీస్తుంది. కళ్లముందే తమ పిల్లలను తమ నుంచి దూరంగా తీసుకెళ్తుంటే ఆ తల్లిదండ్రుల గుండెకోతను ఆపతరం ఎవరివల్లవుతుంది? ఇలాంటి గుండెను మెలిపెట్టే దృశ్యాలకు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణం వేదికగా మారింది. కడుపున తొమ్మిది నెలలు మోయకున్నా గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం. పేగుబంధం కాకున్నా కంటిరెప్పలా కాపాడుకుంటున్నాం దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు.. అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న దంపతులు ఓ వైపు. రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు మ‌రోవైపు అక్క‌డున్న వారికి క‌న్నీళ్లు తెప్పించాయి.

16 మంది చిన్నారుల‌ను గుర్తించిన పోలీసులు

పసికందులకు అంగట్లో సరకులా ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్‌ గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ, పుణెల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని 11 మందిని అరెస్టు చేశారు. వీరు రెండు మూడేళ్లుగా సుమారు 60 మందిని విక్రయించినట్లు తేల్చారు. ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన 16 మందిని పోలీసులు గుర్తించారు. ఆ పిల్లలతో ఆయా తల్లిదండ్రులను పోలీసులు కార్యాలయానికి రప్పించారు. కాగా, సదరు దంపతుల నుంచి ఆయా చిన్నారుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిశువిహార్‌కు తరలించేందుకు యత్నించగా పెంచుకున్న బంధాన్ని విడదీయొద్దంటూ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మహిళలను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు.

బ‌ల‌వంతంగా వాహ‌నాల్లో ఎక్కించుకుని..

బలవంతంగా 16 మంది పిల్లలను వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్తుండగా దంపతులు అడ్డుగా నిలబడ్డారు. సంతానం లేదని బాధతో తెలిసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామన్నారు. ఏళ్ల తరబడి పెంచుకుంటున్న తమ పిల్లలను దూరం చేస్తే బతికేదేలంటూ రోడ్లపైనే కూర్చొని గుండెలు పగిలేలా తల్లిదండ్రులు రోదించారు. వీరిలో 12 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు ఉన్నారు.

పిల్ల‌ల కొనుగోలు చ‌ట్ట‌రీత్యా నేరం..

మరోవైపు చిన్నారుల్ని ఇలా కొనుగోలు చేయడం నేరమని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి ద్వారానే పిల్లలులేని వారు అప్లై చేసుకోవాలన్నారు. జిల్లాలో ఉండే అధికారులు అఫ్లై చేసుకున్న వారి ఆర్డర్ ప్రకారం ఇస్తామన్నారు. ఈ ప్రక్రియకు రెండేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇతర ఏ పద్దతిలో పిల్లలను కొనుగోలు చేసినా అది చట్టవ్యతిరేకం అవుతుందని చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్మన్ రాజారెడ్డి తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement