క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు బెయిల్ మంజూరైంది. చికోటి ప్రవీణ్‌తో సహా 83మంది భారతీయులకు అక్కడి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు షరతులు విధించింది. చికోటి ప్రవీణ్ ఫైన్ చెల్లించే వరకు అతడి పాస్‌పోర్టు అధికారుల వద్దే ఉంచాలని కోర్టు ఆదేశించింది.
థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేయగా.. అందులో 83 మంది భారతీయులు ఉన్నారు. అరెస్టయిన వారిలో బీఆర్‌ఎస్ నేత, మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఏపీలోని నెల్లూరు, గుడివాడకు చెందిన సుమారు 20 మంది ఉన్నారని సమాచారం.