సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకి ఏపీలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరానికి చేరుకున్నారు. సీజేఐ హోదాలో తొలిసారి పొన్నవరం వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు ఎడ్ల బండిపై అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వేదపండితులు మంత్రోచ్చారణతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. గ్రామస్థులు ఆయనకు శాలువాలు కప్పి, గజమాలతో సన్మానించారు. ఆయనకు పలు రకాల కానుకలు అందించారు. ఆయనకు వెండినాగలి కూడా బహూకరించారు. అనంతరం సంప్రదాయ ఎడ్లబండిపై మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దారిపొడవునా ఆయనపై పూలవర్షం కురిపించారు. గ్రామస్తులు ఆయనను సత్కరించారు.
అంతకుముందు, జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు వద్ద ఘనస్వాగతం లభించింది. రోడ్డుకు ఓవైపుగా త్రివర్ణ పతాకాలు చేతబూనిన విద్యార్థినులు నిల్చుని ఆయనకు నీరాజనాలు పట్టారు. జస్టిస్ ఎన్వీ రమణ తన వాహనంలోంచి పైకి లేచి నిల్చుని వినమ్రంగా అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..