Monday, November 18, 2024

హైదరాబాద్ లో సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హైదరాబాద్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, సీఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. మూడు రోజులపాటు రాజ్‌భవన్‌ అతిథిగృహంలో బస చేయనున్నారు.

అంతకు ముందు…శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వేళ్లారు. ఇవాళ రాత్రికి ఆయన రాజ్‌భవన్ లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచుతూ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిల్ బోబ్డే పదవీకాలం ముగియడంతో 2021 ఏప్రిల్ 24న ఎన్వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఆగస్టు 26 వరకు ఎన్వీ రమణ కొనసాగనున్నారు.

ఇదీ చదవండి: ఈటల బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement