Tuesday, November 26, 2024

Big Story: చికెన్​ అంటే ఛీప్​ అనుకుంటివా, ఫైర్​.. స్కిన్​లెస్​ రేటు 290

తెలంగాణలో నాన్‌వెజ్‌ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న, మొన్నటి దాకా తక్కువగానే ఉన్న చికెన్‌ ధర అమాంతం పెరిగి ఆదివారం కేజీ రూ.290కు చేరింది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మటన్‌, చేపలు, రొయ్యల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో అందరూ చికెన్‌ వైపే మొగ్గుచూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే చికెన్‌ షాపు నిర్వాహకులు ధరలను పెంచేస్తున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చేపలు, రొయ్యలు, మటన్​ రేట్లు మండిపోతున్నాయి. దాంతో జనాలంతా చికెన్​ దుకాణాలమీద ఎగబడుతున్నారు. దీంతో కోడి చికెన్‌ ధర అమాంతం పెంచేశారు వ్యాపారులు. అయితే.. కోడి, చికెన్​ ధరల రేట్లు మధ్య కూడా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కేజీ చికెన్‌ రూ.290 వరకు ధర ఉండగా, కేజీ కోడి మాత్రం రూ.120గా ఉంది. వాస్తవానికి పౌల్ట్రీ ధరల ప్రకారం కేజీ కోడి రూ.140వరకు విక్రయాలు జరుగుతుండగా, వ్యాపారులు మాత్రం కేజీకి రూ.20ని తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పౌల్ట్రీ రైతులు కేజీ కోడికి రూ.20ని నష్టపోతున్నారు. జనవరిలో పిల్లలను పెంచకపోవడంతోనే ఇప్పుడు కొరత ఏర్పడగా, వేసవిలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పౌల్ట్రీ రైతుల నుంచి తెలుస్తోంది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా 10వేల బ్రాయిలర్‌ ఫామ్స్‌ ఉండగా, లేయర్‌ ఫామ్స్‌ 2వేలు ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు అక్కడక్కడ కొన్ని ఫామ్స్ ను ఏర్పాటుచేసుకుంటారు.

నాన్‌వెజ్‌ మరింత ప్రియ’మే’నా..
రోజురోజుకు నాన్‌ వెజ్‌ ధరలు మరింత ప్రియంగా మారుతున్నాయి. కరోనాకు ముందు తరువాత అన్నట్టు చికెన్‌ ధరలతో పాటు, మటన్‌, చేపలు, రొయ్యల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పౌల్ట్రీల్లో పెంచాల్సిన దానికంటే తక్కువ స్థాయిలో పిల్లలను పెంచడంతోనే ప్రస్తుతం చికెన్‌ ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. కాగా ఇదే సమయంలో రైతులకు అందాల్సిన పౌల్ట్రీ ధరలు సరిగ్గా అందడంలేదు. సమయానికి దిగుబడి రావాల్సిన కోళ్లు రాకపోవడంతోనే ధరలు పెరుగుతుండగా, ఈ ధరలు వేసవిలో మరింత పెరిగే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లాలోని ఓ పౌల్ట్రీ రైతు ఆంధ్రప్రభతో అన్నారు. దీంతో ఏప్రిల్‌, మేలో నాన్‌ వెజ్‌ ధరలకు రెక్కలురానున్నాయన్నది స్పష్టమవుతుంది. ఒకవైపు పౌల్ట్రీల్లో కోళ్ల పెంపకం తగ్గడంతో పాటు, మరోవైపు వ్యాపారుల అత్యాశ కూడా ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి పౌల్ట్రీలకు నిర్ణయించిన మేరకు ధరను ఇస్తే పెట్టుబడి వస్తుందని, కోళ్లకు ధరలను తగ్గిస్తే.. నష్టాలను చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అయితే వ్యాపారులపై నియంత్రణ లేకపోవడంతోనే చికెన్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.

తగ్గని మటన్‌, చేప, రొయ్యల ధరలు..
వేసవికాలం దగ్గర పడుతున్న సమయంలో నాన్‌వెజ్‌ ధరలు మరింత పెరుగుతున్నాయి.అయితేమటన్‌ ధరలను అదుపులోకి తీసుకురావాలని, తెలంగాణ నుంచే ఇతర రాష్ట్రాలకు మటన్‌ను ఎగుమతి చేయాలన్న భావనతో ప్రభుత్వం గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టినా..అది ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. పైగా నానాటికీ మటన్‌ ధరలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మటన్‌ ధరలు ప్రాంతానికో రకంగా ఉంటుండగా, మార్ట్‌లలో అధిక ధరలు పలుకుతున్నాయి. ఆదివారం నాడు కేజీ మటన్‌ బహిరంగ మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.900వరకు పలకగా, మార్ట్‌లలో రూ.900కుపైగా ధర ఉంది. ధర పెరుగుతుండడంతో వినియోగదారులు మటన్‌వైపు చూడడంలేదు.

మటన్‌తో పాటు చేపలు, రొయ్యల పరిస్థతి కూడా అంతే ఉంది. గతంలో ఆదివారం వచ్చిందంటే చికెన్‌తో పాటు చేపలపై కూడా ఆసక్తి కనబరిచే ప్రజలు ప్రస్తుతం చేపలవైపే చూడడం లేదు. కాగా రొయ్యల పట్ల అస్సలు ఆసక్తి కనబరచడంలేదు. దీనికి కారణం కూడా ధరల పెరుగుదలే. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ కొర్రమీను చేప రూ.400కు పైగా పలుకుతుండగా, మిగతా చేపలైన రవ్వ, బొచ్చె లాంటి చేపలు సైతం రూ. 140కు పైగా ధర పలుకుతున్నాయి. దీంతో పాటు రొయ్యలు కేజీ రూ.350కు పైగా ధర పలుతుండగా సైజును బట్టి అవి ధర కంటే తక్కువ పరిమాణంలో వస్తున్నాయని కూడా వినియోగదారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement