మాంసం ప్రియులకు ఇది చేదు వార్తే. ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం కోడి దరలు పెరగడమే. రోజురోజుకు చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు అంమాతం పెరిగాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ (స్కిన్ లెస్) ఇప్పుడు రూ.300కు విక్రయిస్తున్నారు. కొన్ని వారాల క్రితం రూ.200 లోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు భారీగా పెరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర రూ.300లకుపై ఉంది. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. ఇక, హైదరాబాద్‌లో 290 నుంచి 310 వరకు చికెన్ ధర పలుకుతోంది. దీంతో చికెన్ కొనేందుకు మాంసం ప్రియులు జంకుతున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులతోపాటు చికెన్ కూడా కొనలేని పరిస్థితికి చేరిందనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫారాల్లో వినియోగించే దాణా రేటు పెరగడం, ఫారాల్లో కొత్త జాతులు అందుబాటులోకి రాకపోవడంతో కోళ్ల ధరలు పెరిగాయని చెబుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా పక్షులు చనిపోతున్నాయని, బర్డ్ ఫ్లూ వదంతుల కారణంగా కొత్త జాతులు ఉత్పత్తి కావడం లేదని పౌల్ట్రీ రైతులు పేర్కొన్నారు. అయితే డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ఎండాకాలం వచ్చేసరికి చికెన్ రేట్లు తగ్గుతాయి. పౌల్ట్రీ రైతులు వేసవి తాపానికి పక్షులు చనిపోవడంతో పూర్తి బరువు రాకముందే వాటిని విక్రయిస్తారు. దాంతో కిలో కోడిమాంసం ధర గతంలో రూ.160 నుంచి రూ.180 పలుకగా.. ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. పౌల్ట్రీ ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. కాబట్టి, ధరలు పెరిగాయి.