ఐపీఎల్ లో కోహ్లీసేనకు తొలి ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును బెంబేలెత్తించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ విజయం వైపు పరుగెడుతున్నట్లు అనిపించలేదు. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(34; 15 బంతుల్లో 4×4, 2×6), మాక్స్‌వెల్(22; 15 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఓపెనర్లు త్వరగా ఔట్ అవడంతో అప్పటికీ మ్యాక్సీ, ఏబీడీ ఉన్నారు కదా.. అనే ధీమాతో ఆర్సీబీ అభిమానులుండగా.. చెన్నై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వారి ఆశలను ఆవిరి చేశాడు. అనంతరం మిగతా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే చెన్నై బౌలర్లలో జడేజా 3, ఇమ్రాన్ తాహిర్ 2, సామ్‌కరన్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్ (50), రుతురాజ్ గైక్వాడ్ (33) రాణించారు. అయితే బెంగళూరు బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీయడంతో చెన్నై జట్టు కష్టాల్లో పడింది. రైనా (24), రాయుడు (14) మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంతో విఫలమయ్యారు.
అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 28 బంతుల్లో 5 సిక్సులు, నాలుగు ఫోర్ల సహాయంతో 62 పరుగులు సాధించాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో నాలుగు వరుస సిక్సులు సంధించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో CSK జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు సాధించగా.. చాహల్ ఓ వికెట్ పడగొట్టాడు.