ఖమ్మం టీఆర్ఎస్ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్న సీనియర్ లీడర్.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దారిలోకి వచ్చారా? సీఎం కేసీఆర్ భద్రచలం టూర్‌తో ఈ కీలక నేత సెట్ అయినట్టేనా? అంటే అవుననే అంటున్నారు ఆ జిల్లా లీడర్లు. ఖమ్మం రాజకీయాల్లో విభేదాలకు చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ అంతా సెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.. అయితే ఆ జిల్లాలో ఎందుకు ఇట్లా జరిగిందో ఓ సారి పరిశీలిస్తే..
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. భద్రాచలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరకట్టల నిర్మాణంలో అప్పట్లో తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి, ఆయన కృషిని అభినందించారు. దీంతో ఇంతకాలం పార్టీలో ప్రాధాన్యం లేదనుకున్న తుమ్మల నాగేశ్వరరావు ఈ దెబ్బతో దాదాపు సెట్ అయినట్టేనని చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు.
అయితే.. సీఎం కేసీఆర్‌కు తుమ్మల సన్నిహితుడిగా పేరుగాంచారు. గత జనరల్ ఎలక్షన్స్‌లో సీనియర్ లీడర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమితో ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అప్పటి నుంచి జిల్లాలో మంత్రి అజయ్ తన పట్టు పెంచుకుంటూ, సీనియర్లను పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక.. అశ్వారావుపేట కానిస్టెన్సీలో ఇన్చార్జి బాధ్యతల విషయంలోనూ పువ్వాడ, తుమ్మల వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. అక్కడితో ఆగకుండా తుమ్మల సొంత నియోజకవర్గమైన పాలేరులోనూ ఆయనకు వరుసగా షాక్‌లమీద షాక్‌లు ఎదురయ్యాయి.
ఇట్లా పాలేరులో తుమ్మల వర్సెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నట్టుగా ఆ నియోజకవర్గ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకున్నాయి. సోషల్‌మీడియా వేదికగా ఈ రెండు గ్రూపులకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలతో పోస్టులు చేసుకున్నారు. గత ఎన్నికల నుంచి మొదలైన రగడ తగ్గకపోగా, మరింత పెరుగుతూ వచ్చింది. అయితే.. కాంగ్రెస్ నుంచి బరిలో దిగి తుమ్మలపై గెలిచిన ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ పోరు మరింత ఉధృతమయ్యింది.
నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలోనూ తమ వర్గాన్ని టార్గెట్ చేసుకుని అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం తుమ్మల బహిరంగంగానే ఆరోపణలు చేశారు. పార్టీలో ప్రాధాన్యం దక్కకపోగా.. చిన్న చిన్న లీడర్ల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారే చాన్సెస్ ఉన్నాయని చాలామంది భావించారు. కానీ, గోదావరి వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు పార్టీ శ్రేణులను, అటు అసంతృత్తులను సెట్ చేసి.. ఇక ఇబ్బంది లేకుండా చూశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకముందు కూడా కలిసి మెలిసి ఉంటారా? లేక మళ్లీ లుకలుకలు స్టార్ట్ అయ్యేనా అనేది ఫ్యూచరే నిర్ణయిస్తుందని పరిశీలకులు అంటున్నారు.