వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ సీట్ల మాప్ అప్‌రౌండ్ కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన యూనివర్సిటీ పోలీస్ విచారణకు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా రాష్ట్రంలోని కొన్ని మెడికల్ కళాశాలలు, ఇతర రాష్ట్రాలకు చెందిన మెరిట్ విద్యార్థుల సర్టిఫికెట్లను అప్రోల్ చేసి సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడినట్లు 10 రోజుల క్రితమే ఆంధ్రప్రభ కథనం వెలువరించింది. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ను ఆదేశించింది. మాప్ ఆప్ రౌండ్‌లో సీట్లు పొంది కూడా చేరని విద్యార్థులను యూనివర్సిటీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. కొంత మంది విద్యార్థులు డొంకతిరుగుడు సమాచారం ఇవ్వగా, మరికొంత మంది తమ సర్టిఫికెట్లను అప్రోల్ చేయకపోవడంతో ఖంగుతిన్న యూనివర్సిటీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు, వైద్యవిద్య కార్యదర్శికి నివేదిక పంపించింది.
మంత్రి హరీష్‌రావు దృష్టికి వెళ్లడంతో మంత్రి ఆదేశాలతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషిని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని మెడికల్ సీట్లను వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భర్తీచేస్తోంది. కన్వీనర్, యాజమాన్య, ఎన్నారై, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు ఉంటాయి. కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్లను మెరిట్ ఆధారంగా వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించి యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత సీట్లు మిగిలితే వాటిని కళాశాలల యాజమాన్యాలు స్వంతం భర్తీచేసే అవకాశం ఉంది. దీన్ని అడ్డంపెట్టుకొని కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు సీట్ల దందాకు పాల్పడుతున్నది. యూనివర్సిటీకి తెలిసినా.. పట్టిచుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. అదేబాటలో ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలలు సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడ్డాయి.
పీజీ మెడికల్ సీట్ల భర్తీకి మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ… మిగిలి పోయిన సీట్ల కోసం మార్చి 31న యూనివర్సిటీ అదనపు మాఫ్ ఆప్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని అడ్డంపెట్టుకున్న కళాశాలల యజమాన్యాలు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందిన మెరిట్ విద్యార్థుల సర్టిఫికెట్లను కమీషన్ ఇచ్చే ప ద్దతిపై తీసుకొని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేశారు. ఒక్కో సీటు విలువ కోటి నుండి 2 కోట్ల వరకు డిమాండ్ ఉండటంతో ప్రైవేట్ మెెడికల్ కళాశాలలు అడ్డదార్లు తొక్కాయి. సీట్లను అమ్ముకునేందుకు తెరలేపాయి. మెరిట్ విద్యార్థుల సర్టిఫికెట్లను అడ్డంపెట్టుకొని చీటింగ్‌కు పాల్పడ్డాయి. రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలలు సుమారు 48 మంది విద్యార్థులకు అడ్డదారుల్లో సీట్లు అందించాయి. వారికి సీట్లు వచ్చిన తర్వాత కూడా కళాశాలల్లో వారు చేరలేదు. ఈ విషయాన్ని ఏప్రిల్ 9న ఆంధ్రప్రభ దినపత్రిక చీటింగ్ మెడికల్ మాప్ ఆప్ కౌన్సెలింగ్‌లో సీట్ల బ్లాకింగ్ పేరుతో కథనం వెలువరించింది.
దీంతో స్పందించిన ప్రభుత్వం విచారణ చేపట్టాలని వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది. యూనివర్సిటీ సీట్లు వచ్చినా జాయిన్ కాని విద్యార్థులకు నోటీసులు పంపించింది. విద్యార్థులు సమాధానం ఇవ్వకపోగా, కొంత మంది విద్యార్థులు తాము సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయలేదని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి హరీష్‌రావు సీరియస్‌గా భావించి తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మెడికల్ సీట్లు రాకుండా ప్రైవేట్ కళాశాలలు అడ్డదార్లు దొక్కడంపై విచారణ చేపట్టాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. దీంతో కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ వరంగల్ సీపీని స్వయంగా కలిసి సీట్ల బ్లాకింగ్‌పై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు.