హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తామని పన్నేండేళ్ల కన్న కూతురికి మాయ మాటలు చెప్పి బాల్య వివాహం చేసిన తల్లిదండ్రుల దారుణం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో వెలుగు చూసింది. పన్నేండేళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో సోమవారం పెళ్లి జరిపించారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో కన్న కూతురి మెడలో మంగళసూత్రం కట్టించారు. దీంతో బాలిక తన పెళ్లి విషయాన్ని ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామస్తులకు తెలిపింది. అనంతరం తనకు పెళ్లి ఇష్టం లేదని బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో బాలిక ఉన్నచోటుకు వచ్చి బంధువులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ బాలిక అక్కడి నుంచి వెళ్లిపోయి వేరేచోట తల దాచుకుంది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక తల్లిదండ్రులది నిరుపేద కుటుంబం. సంచార జీవితం గడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎక్కడో ఉంటామో.. ఏం చేస్తామో తెలియని కుటుంబంలో ఆ బాలిక పుట్టింది. పుట్టిన రోజు చేద్దామని ఈ ఏడాది మరింత ఘనంగా వేడుకలు జరుపుదామని నిర్ణయించిన తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తన తల్లిదండ్రులు తన బర్త్ డేని ఘనంగా జరుపుతున్నారని తెలిసి ఆ బాలిక మురిసిపోయింది. కానీ ఆ బాలికకు తెలియదు. తనకు జరుపుతున్నది పుట్టిన రోజు కాదు పెళ్లి అని. ఇంట్లో హడావుడి మొదలైంది. పండగ వాతావరణం నెలకొని ఉంది. ఇంటికి ఎప్పుడూ రాని చుట్టాలు వస్తున్నారు. ఇదంతా చూసి ఆ చిన్నారి అవాక్కైంది. 12వ ఏటా అడుగు పెడుతున్న కదా అందుకే పుట్టిన రోజున ఘనంగా చేస్తున్నారేమో అని సంబర పడింది. ఆ రోజురానే వచ్చింది. సందడి మరింత పెరిగింది. పుట్టిన రోజుకు కేక్ తేవాలి కదా.. కనబడడం లేదే అని వెతికింది. ముందురోజు కేక్ తెచ్చి పెడతారేమోనని ఊహించింది. ఇంకో రోజు మాత్రమే గడువు ఉంది. అసలు జరుగుతుందేంటో తనకు అర్థం కాలేదు.
ఇంట్లో వాళ్లు చీర కట్టించి ముస్తాబు చేశారు. అద్దం నిలబడి చూసుకుంటే పెళ్లికూతురులా కనిపించింది. అప్పటికీ తల్లిదండ్రులను అడుగితే మళ్లి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం బయటకు తీసుకువెళ్లి ఓ వ్యక్తి పక్కన కూర్చోబెట్టారు. తనకంటే మూడురెట్ల వయసు ఎక్కువ ఉన్న వ్యక్తి అని ఊహించింది. అతనూ పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు. చూస్తే పెళ్లి వేడుకలా ఉంది. అప్పుడు కాని ఆ అమాయకురాలికి అర్థం కాలేదు. తనకు చేస్తున్నది పుట్టిన రోజు కాదు.. పెళ్లని. దీంతో ఒక్క ఉదుటన పెళ్లి పీటల పైనుంచి లేచి తనకు ఈ పెళ్లి వద్దంటూ బిగ్గరగా అరిచింది. తన వాళ్లను వేడుకుంది. ఈ పెళ్లి వద్దని బతిమిలాడింది. అయినా వాళ్లు వినలేదు. బలవంతంగా ఆ వ్యక్తితో చిన్నారికి మూడు ముళ్లు వేయించారు. స్థానికుల సహాయంతో ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు రంగప్రవేశం చేసి ఆ బాలికను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దాదాపు తన వయసున్న వ్యక్తితో కూతురికి పెళ్లి చేయాలని భావించిన తండ్రిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాల్య వివాహాలపై నిషేధం ఉన్నా ఈ తరహా వివాహాలు జరపవద్దని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా ఎక్కడో ఒక దగ్గర ఈ తరహా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.