Wednesday, November 20, 2024

పెండింగ్‌ చలాన్లు కట్టని వారిపై చార్జీషీట్‌.. ఏప్రిల్ 1నుంచి ఫుల్ పేమెంట్ చేయాలే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గురువారంతో ముగుస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్‌ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఈనెల 31 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ రాయితీ గడువును పెంచేది లేదని ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో వాహనాలపై చలాన్ల మొత్తాన్ని వసూలు చేస్తామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. పెండింగ్‌ చలాన్ల చెల్లింపు ప్రక్రియకు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కోట్ల 16 లక్షల పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ అయ్యాయని దీనివల్ల రూ.2.30 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌లో కోటి చలాన్ల వరకు క్లియర్‌ అయ్యాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం నుంచి రూ.75 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. రోజుకు 15 లక్షల పెండింగ్‌ చలాన్లను వాహనదారులు చెల్లిస్తున్నారని ఏప్రిల్‌ నుండి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పెండింగ్‌ చలాన్లు కట్టని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వందకుపైగా పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనదారులపై ఛార్జీషీట్లు నమోదు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రెండు ట్రాఫిక్‌ జోన్లలో మొత్తం ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశామని ఈ బృందాలు పెండింగ్‌ చలాన్లు కట్టని వారిని గుర్తించి వారిపై ఛార్జీషీట్‌ నమోదు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతుందని చెప్పారు. చలాన్లు చెల్లించని వారిని టాప్‌ వాయిలెటర్స్‌గా గుర్తిస్తామని చెప్పారు. పెండింగ్‌ చలాన్లు కట్టని వారి ఇళ్లకు వెళ్లి ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా కౌన్సెలింగ్‌ ఇస్తామని చెప్పారు. వాహనంపై ఉన్న పెనాల్టి మొత్తాన్ని బట్టి అక్కడే వాహన దారుల నుంచి వసూలు చేస్తామని చెప్పారు. రాయితీతో పెండింగ్‌ చలాన్లను చెల్లించేందుకు గురువారంతో గడువు ముగుస్తున్నందున వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement