– వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం కనిపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యింది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు కాస్త టెన్షన్ పడ్డారు. ల్యాండింగ్ మాడ్యూల్‌ను తనిఖీ చేశారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగడానికి సూర్యోదయం కోసం వెయిట్ చేశారు. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం సాయంత్రం ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇక.. సరైన ఎత్తులో, సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. ల్యాండర్ మాడ్యూల్‌లో పారామీటర్లన్నింటినీ తనిఖీ చేసి ఎక్కడ సాఫ్ట్ ల్యాండ్ కావాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ నుండి ఇస్రో సంబంధిత కమాండర్లను ల్యాండర్ మాడ్యూల్‌కు అప్ లోడ్ చేసింది. ల్యాండింగ్ షెడ్యూల్‌కు రెండు గంటల ముందు ఇది చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ జోహెన్నస్‌బర్గ్ నుంచి వర్చువల్‌గా వీక్షించారు.