చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న(బుధవారం) చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించే షెడ్యూల్‌లో ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. అన్ని వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలు జరుపుతున్నాయని, ఇప్పటివరకైతే తాము ఆశించినట్టుగా అంతా సాఫీగా జరుగుతోందని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం 5:20 గంటలకు ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందని ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది.
చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో అధికారికంగా సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆగస్ట్ 19, 2023న దాదాపు 70 కి.మీ ఎత్తు నుండి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (LPDC) ద్వారా సేకరించిన చంద్రుని చిత్రాలను కూడా స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. LPDC చిత్రాలు ల్యాండర్ మాడ్యూల్‌ను ఆన్‌బోర్డ్ మూన్ రిఫరెన్స్ మ్యాప్‌తో సరిపోల్చడం ద్వారా దాని స్థానాన్ని (అక్షాంశం, రేఖాంశం) నిర్ణయించడంలో ఎంతో ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది.
చంద్రుడిపై అంతరిక్ష నౌక దిగేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకుంటే చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి పోస్ట్ పోన్ చేస్తామని ఇస్రో శాస్త్రవేత్త చెప్పారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23న మూన్‌క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుందని అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్-ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు.
“ఆగస్టు 23న, చంద్రయాన్-3 చంద్రునిపై దిగడానికి రెండు గంటల ముందు, ల్యాండర్ మాడ్యూల్ యొక్క ఆరోగ్యం, చంద్రునిపై పరిస్థితుల ఆధారంగా ఆ సమయంలో దానిని ల్యాండింగ్ చేయడం సముచితమా లేదా అనే దానిపై మేము నిర్ణయం తీసుకుంటాము. ఒకవేళ, ఏదైనా అంశం అనుకూలంగా లేదని అనిపిస్తే, ఆగస్ట్ 27న చంద్రుడిపై మాడ్యూల్ ల్యాండ్ చేస్తాం. ఎలాంటి సమస్య తలెత్తకూడదు, ఆగస్ట్ 23న మాడ్యూల్‌ను ల్యాండ్ చేయగలుగుతాం” అని ఆయన వార్తా సంస్థ ANIకి తెలిపారు.