పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలయ్యింది. అయితే బీజేపీకి చెందిన ఓ మహిళా అభ్యర్ధి విజయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ టిక్కెట్‌పై సలోత్ర నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన చందనా బౌరీ…. టీఎంసీ అభ్యర్థి సంతోష్ మండల్‌ను 91,648 ఓట్ల భారీ తేడాతో ఓడించింది. చందనా బౌరీ విజయం కన్నా ఆమె జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చందనా బౌరీ భర్త ఒక రోజు వారి కూలీ. పెద్దగా ఆస్తులు లేవు. వారికి ఉన్న ఆస్థి కేవలం మూడు మేకలు, మూడు ఆవులు ఉండడానికి ఒక చిన్న గుడిసె ఉంది అంతే. వాటిని చూసుకుంటూ ఆమె రోజు బయట పనికి వెళ్ళేది. అలాంటి ఆమె కుటుంబానికి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పక్క వారికి ఏదోలా సహాయపడాలనే గుణం, మంచి ఆలోచన ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది.
కాగా చందనా బౌరీ ఎన్నికల్లో తన నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అఫిడవిట్‌లో తన బ్యాకు ఖాతాలో కేవలం రూ.6,335 ఉన్నట్లు పేర్కొన్నారు. తన భర్త ఖాతాలో రూ.1,561 ఉన్నాయని పేర్కొంది. తన భర్తకు ఎటువంటి భూమి లేదని తెలిపింది. కాగా చందన 12 వ తరగతి వరకూ చదువుకోగా, భర్త ఎనిమిది వరకూ చదువుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చందనా బౌరీని స్ఫూర్తిగా తీసుకుని ఇలాగే ఎంతోమంది రాజకీయాల్లోకి రావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.