Tuesday, November 26, 2024

Big Story | అందరికీ మళ్లీ చాన్స్.. సిట్టింగ్​లకే సీట్లు

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తమ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించింది. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థుల వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా, ఉమ్మడి జిల్లా నుండి 4, 5 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించి, మిగతా వారిని తర్వాత ప్రకటిస్తారని అంతా ఊహించారు. కానీ, ఉమ్మడి మెదక్ జిలాలోని 11 అసెంబ్లీ స్థానాలకు గాను 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్నికల సంగ్రామానికి తెరతీశారు. ఒక్క నర్సాపూర్ అభ్యర్థిని పెండింగ్లో పెట్టి ఉమ్మడి మెదక్ లో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అంతటా సంబురాలు జరుగుతున్నాయి. ఇక.. దుబ్బాక నుంచి ఈసారి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. మిగతాస్థానాలన్నింటిని సిట్టింగ్ లకే ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిపక్షాలకు ఊహించని షాక్..
ప్రతిపక్ష పార్టీలు ఊహించని రీతిలో అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రజలు, పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. ఇక అభ్యర్థుల జాబితా ప్రకటనలో మరోమారు మంత్రి హరీశ్రావు తన మార్క్ ను చాటుకున్నారు.

గజ్వెల్, కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ
సీఎం కేసీఆర్ గజ్వెల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీచేసేందుకు నిర్ణయం తీసుకున్నాఉ. గతంలో కరీంనగర్, సిద్దిపేట నుండి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందిన ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, తాను గతంలో కూడా కరీంనగర్, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఈసారి తమ జిల్లా నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేశారని, కామారెడ్డి ఎమ్మెల్యే తనను ఆ స్థానం నుంచి పోటీ చేయమని అడిగారని అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని రెండు స్థానాలకు పోటీ చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై రాజకీయ నిపుణులు మాత్రం కేసీఆర్ కేవలం తన కుమార్తె కోసమే రెండు చోట్ల నుండి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు.

తన మార్కు చాటుకున్న మంత్రి హరీశ్​రావు
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 11 స్థానాలకు గాను 10 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన విషయంలో మంత్రి హరీశ్ రావు తన మార్కును చాటుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పటాన్ చెరు, మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాల విషయంలో అభ్యర్థుల మార్పు ఉంటుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ తీసుకుని తన అనుయాయులకు అన్యాయం జరగకుండా జాగ్రత్త పడ్డాడని సమాచారం. దీని పలితంగా మరోమారు ఉమ్మడి జిల్లాలో తన మార్కు చాటుకున్నారు. పటాన్ చెరు నుంచి నీలం మధు టికెట్ ఆశించినా.. గూడెం మహిపాల్ రెడ్డికే కేటాయించారు. మెదక్ నుంచి మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్ కు ఆశించినప్పటికీ పద్మాదేవేందర్ రెడ్డికి కట్టబెట్టారు.

- Advertisement -

అయితే.. సోమవారం ఉదయం హుటాహుటిన పద్మాదేవేందర్ రెడ్డి ప్రగతిభవన్ కు తరలివెళ్లడం పై ఆమె అనుచర వర్గంలో కొంత అలజడి నెలకొంది. అయినప్పటికీ కేసీఆర్ ప్రకటించిన జాబితాలో పద్మాదేవేందర్ రెడ్డి పేరు ఉండటంతో పద్మక్క అనుచరులంతా సంబురాలు చేసుకున్నారు. ఇక.. సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి బీఆర్ ఎస్ లో చేరుతున్నారని, ఆయనకే టికెట్ అంటూ ప్రచారం జరిగింది. కాగా, ఆ నియోజకవర్గంలో చింతా ప్రభాకర్ పార్టీ కోసం, సంగారెడ్డి ప్రజల కోసం గట్టి పోరాటం చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఓటమి చెందినా.. పార్టీని అంటిపెట్టుకుని, నిత్యం ప్రజల్లో ఉండటాన్ని అధిష్టానం గుర్తించి తిరిగి ఆయనకే టికెట్ కట్టబెట్టింది. ఇక జహీరాబాద్ నుండి మాణిక్ రావు పేరు, అందోల్ నుండి చంటి క్రాంతి కిరణ్ పేరుపై కొంత అనుమానం వ్యక్తమైనా చివరికి పాత కాపులకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి ఉమ్మడి మెదక్ అభ్యర్థుల విషయంలో మంత్రి హరీశ్రావు తన పంథాన్ని నెగ్గించుకున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

హరీశ్​రావుపై మైనంపల్లి ఆగ్రహం..’
చాలాకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని తన కుమారుడు రోహిత్ కు కేటాయించాలని మైనంపల్లి హన్మంతరావు అడుగుతూ వస్తున్నారు. అక్కడ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజల్లో అభిమానం చూరగొన్నారు. అయితే.. సోమవారం ఉదయం మైనంపల్లి అనుకోని రీతిలో మంత్రి హరీశ్రావుపై రివర్స్ అయ్యారు. సీఎం కేసీఆర్ ప్రకటించబోయే జాబితాలో తన కుమారుడికి చోటు దక్కలేదన్న విషయం తెలిసి… ఇదంతా హరీశ్రావు పనే అని మీడియా ముందుకు వచ్చారు. సిద్దిపేటలో అభివృద్ధికి నిరోధకంగా హరీశ్రావు నిలిచారని, కోట్లాది రూపాయలను అక్రమంగా పోగేసుకున్నారని ఆరోపిస్తూ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సిద్దిపేట నుంచి, తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు పెత్తనమేంటని ప్రశ్నించారు. తన తడాఖా చూపుతామని హెచ్చరించారు.

https://epaper.prabhanews.com/Medak?eid=23&edate=22/08/2023&pgid=237380&device=desktop&view=3

Advertisement

తాజా వార్తలు

Advertisement