వరంగల్: స్టేషన్ ఘన్‌పూర్ భారాస ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడియం.. రాజయ్య తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజయ్య పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని.. అయినప్పటికీ మీరు తొందరపడొద్దని పార్టీ పెద్దలు తనకు సూచించినట్లు కడియం పేర్కొన్నారు. అందువల్లే తాను రాజయ్యపై ఎలాంటి విమర్శలు చేయకుండా ఊరుకున్నట్లు చెప్పారు.
ఇక జిల్లాలోని హిమ్మత్‌నగర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన రాజయ్య.. అదే తీరుతో తీవ్ర స్థాయిలో నాపై విమర్శలు చేశారు. అది చూశాక కూడా ఆయన చేస్తోన్న విమర్శలపై నేను వివరణ ఇచ్చుకోకపోతే.. ప్రజలు నన్ను అపార్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే అసలు విషయం చెబుతున్నానని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాజేసేందుకే 4 రోజులు ఆగి ఇవాళ మీడియా ముందుకు వచ్చానన్నారు .. రాజయ్య వైద్యుడై ఉండి.. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నా తల్లి కులం, నా కులం గురించి కూడా మాట్లాడటం దారుణమన్నారు.
పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. తల్లి మాత్రమే సత్యం అని,. తండ్రి అనేది అపోహ అని రాజయ్య మాట్లాడటం దారుణమన్నారు. సమాజంలో ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారంటూ అందుకు ఆయన తన ముక్కును నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కడియం డిమాండ్ చేశారు..తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పోటీ నుంచి వైదొలుగుతా” అని రాజయ్యకు సవాల్ విసిరారు.