Tuesday, November 26, 2024

Swachh Telangana: దేశంలోనే నెం.1 తెలంగాణ.. రాష్ట్రాన్ని అభినందించిన కేంద్రం

దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ అనేక అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ODF- ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) సమాజ నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్.1 గా నిలిచి.. మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర స్వచ్చ భారత్ మిషన్ విడుదల చేసింది.

స్వచ్ఛ భారత్ మిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు స్వచ్ఛ గ్రామాల్లో 1/3 వ వంతు గ్రామాలలో తెలంగాణ రాష్ట్రమే ODF లను పూర్తి చేసిందని తెలిపారు. అలాగే దేశంలో 17,684 ODF గ్రామాలు వుండగా అందులో 6,537 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో వున్నాయి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో వుండగా తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 2,3,4 స్థానాలను కలిగి వున్నాయి.

ఇదిలావుండగా.. రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ…మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అని రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కెసిఆర్ గారు చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ది పనులు చేపడుతూనే..నిరంతరం పారిశుధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి అభినందనలు వస్తున్నాయి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి, స్వచ్చ రాష్ట్ర, భారత నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు అభినందనలు, కేంద్రానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement