Sunday, November 24, 2024

గోదావరి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్​ టీమ్​.. క్షేత్రస్థాయిలో ముంపు నష్టంపై అంచనా!

తెలంగాణలో ఇవ్వాల (శుక్రవారం) సెంట్రల్​ టీమ్​ పర్యటిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. సౌరవ్ రాయ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గ బృందం భద్రాచలం పట్టణం, గోదావరి వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న పరిసర గ్రామాల్లో పరిస్థితులను అంచనా వేసింది.

ఇళ్లు, రోడ్లు, పంటలు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను బృందం సభ్యులు పరిశీలించారు. బాధిత ప్రజలతోనూ వారు మాట్లాడి నష్ట తీవ్రతను అంచనా వేశారు. వరదల వల్ల జరిగిన నష్టాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా సెంట్రల్‌ టీమ్​ ఐటీడీఏ కార్యాలయంలో చూశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలను జిల్లా కలెక్టర్ డి.అనుదీప్ కేంద్ర బృందానికి వివరించారు. వివిధ శాఖలకు రూ.162 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన అంచనా వేశారు.

అంతకుముందు నిర్మల్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను బృందం సందర్శించింది. పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గత వారం రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో వచ్చిన కడెం డ్యామ్‌ను ఈ బృందం పరిశీలించింది. వరదల వల్ల జరిగిన నష్టాలను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ బృందానికి వివరించారు.

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కూడా పర్యటించి నష్టాలను అంచనా వేసిన బృందానికి విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్ బొజ్జా పరిస్థితిని వివరించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఈ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను కలవనుంది. క్షేత్రస్థాయి పరిస్థితి, వివిధ శాఖల నష్టాల అంచనాలపై రాష్ట్ర అధికారులు బృందానికి వివరిస్తారు.

క్షేత్రస్థాయి పరిశీలన, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ బృందం కేంద్రానికి నివేదికను అందజేసి, వరద సహాయాన్ని సిఫార్సు చేస్తుంది. రాష్ట్రానికి వరద సహాయానికి తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం వివిధ శాఖలకు దాదాపు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement