కరోనా వ్యాక్సిన్‌లపై జీఎస్టీ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కరోనా టీకాలపై జీఎస్టీ వేయడం అవసరమేనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వ్యాక్సిన్‌లకు జీఎస్టీ మినహాయిస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. కరోనా చికిత్సలో మెడిసిన్‌లకు జీఎస్‌టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే దేశీయ తయారీదార్లు ముడి పదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదారులపై భారం పడుతందని ఆమె వివరించారు.
కాగా ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5 శాతం, కోవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లపై 12 శాతం జీఎస్‌టీని కేంద్రం ప్రభుత్వం వసూలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఈ విషయంపై మమతా బెనర్జీ లేఖ కూడా రాశారు.