Tuesday, November 26, 2024

పాత వాహనాలపై కొత్త పన్ను..

వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. వాహనాలపై హరిత పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. 15 ఏళ్లకు పైబడిన 4 కోట్ల వాహనాలపై హరిత పన్నును విధించబోతున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. 4 కోట్ల పాత వాహనాల్లో సగానికిపైగా 20 ఏండ్ల వాహనాలేనని కేంద్రం చెప్పింది. ఈ ఏడాది జనవరిలోనే హరితపన్నుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమైంది.

నాలుగు కోట్ల పాత వాహనాల్లో ఎక్కువగా కర్ణాటకలోనే ఉన్నాయి. కర్ణాటక లో70 లక్షల దాకా పాత వాహనాలున్నట్టు చెప్పింది. కర్ణాటక తర్వాత అత్యధిక పాత వాహనాలున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తర్ ప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 56.54 లక్షల పాత వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అందులో 24.55 లక్షల వాహనాలు 20 ఏండ్లకు పైనవే కావడం గమనార్హం. 49.93 లక్షల పాత వాహనాలతో ఢిల్లీ మూడోప్లేస్ లో ఉంది. ఆ రాష్ట్రంలో 20 ఏండ్లకు పైబడిన 35.11 లక్షల పాత వాహనాలున్నాయి. కేరళలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 34.64 లక్షలుంటే.. తమిళనాడులో 33.43 లక్షలున్నాయి. పంజాబ్ లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 22.69 లక్షలున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో 17.58 లక్షల నుంచి 12.29 లక్షల వరకున్నాయి. తెలుగు రాష్ట్రాల వివరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని వెల్లడించలేదు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement