దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీలో పరిస్థితి చేయిదాటిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో అధికారులు వీకెండ్ కర్ఫ్చూ, నైట్ కర్ప్యూ విధించారు. అయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మధ్య ఉన్న ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనేది అసలు ప్రశ్న. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉండొచ్చు కానీ కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరగడానికి కేంద్ర నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా ఫస్ట్ వేవ్‌లో పేదవారికి వైద్యం సరిగ్గా దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం ప్రత్యక్షంగా చూశాం. అయినా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడంలో విఫలమైందనే చెప్పాలి. ఏడాది కాలంగా వైద్య సిబ్బందిని రిక్రూట్ చేసుకోకపోవడం, జూనియర్ డాక్టర్లు ఎన్నో సేవలు అందించినా వారికి ఇన్సెంటివ్‌లు అందించకపోవడం కేంద్రం నిర్లక్ష్యమే సెకండ్ వేవ్‌కు కారణమని పలువురు విమర్శిస్తున్నారు. పీఎం కేర్స్ ద్వారా కోట్లలో విరాళాలు సేకరించినా వాటిని ఏం చేశారనేది కేంద్రం ప్రకటించలేదు. సదరు నిధులతో ఎక్కడా కరోనా పేషెంట్లకు సరిపడా కొత్త ఆస్పత్రులను నిర్మించిన దాఖలాలు లేవు. సెంట్రల్ విస్టా (పార్లమెంట్ కొత్త భవనం), అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలపై పెట్టిన దృష్టి హెల్త్ డిపార్టుమెంట్‌పై కేంద్రం పెట్టలేదని, కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్ వంటి పథకం కింద పెట్టి ఉంటే పేదలకు సక్రమంగా వైద్యం అందేదని సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. అటు యువత ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశంలో వ్యాక్సిన్‌ను తొలుత 60 ఏళ్లకు పైబడిన వారికి, ప్రస్తుతం 45 ఏళ్లకు పైబడిన వారికి అందిస్తుండంతో సెకండ్ వేవ్‌లో కరోనా మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయనే విషయం నగ్న సత్యం. కరోనా వ్యాక్సిన్ డోసులను పక్క దేశాలకు దిగుమతులు చేసి ఇప్పుడు దేశంలో కొరత ఏర్పడిన తర్వాత ఎగుమతులు చేసుకునే విషయంపై కేంద్రం దృష్టి పెట్టడం కూడా ఆకులు కాలిపోయాక చేతులు పట్టుకున్నట్లు ఉందని పలువురు విమర్శిస్తున్నారు. కాగా ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ వస్తే ప్రైవేట్ ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత మేరకు కరోనా వేవ్‌కు సిద్ధంగా ఉన్నాయో చెప్పకనే చెప్తున్నట్లు ఉన్నాయని తెలుస్తోంది.