దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న క్రమంలో.. దేశంలో లాక్డౌన్ పెట్టాలని ఇటు పార్టీల నుంచి, అటు ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. అయినా దీనిపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనకడుగు వేస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కరోనాను కంట్రోల్ చేయడానికి దేశవ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమని, కాబట్టి దీని గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. లాక్ డౌన్ వల్ల ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల గురించి తమకు తెలుసని, ముఖ్యంగా పేదలు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేసిన తర్వాత లాక్ డౌన్ పెట్టాలని తెలిపింది.
దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండగా ఎక్కువ మంది ప్రాణాలు పోతుంది దీని వల్లే అని పేర్కొంది. పరిస్థితి చేయి దాటకముందే లాక్డౌన్పై నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి పని ఒత్తిడి కల్గకుండా చూడాలని పేర్కొంది. అంతే కాకుండా ఆక్సిజన్, వ్యాక్సిన్ నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆర్డర్ వేసింది. ఆక్సిజన్ సమస్యను మే 3 అర్ధరాత్రి లోపు పరిష్కరించాలని సూచించింది. అలాగే మే 10లోపు తాము సూచించిన వాటన్నింటిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.