దేశంలో కొవిడ్ టీకాను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా రెండో దశ దేశంలో భారీగా ప్రభావం చూపింది. దీంతో టీకాల పంపిణీ, ఎగుమతి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఈ మేరకు ముందస్తుగా ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నది.
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కంపెనీకి 30 కోట్ల డోసుల ఆర్డర్ ఇవ్వగా.. రూ.1500 కోట్లు ముందస్తుగా చెల్లింపులు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు బయోలాజికల్-ఈ తయారు చేసి, నిల్వ చేస్తుందని పేర్కొంది. బయోలాజికల్-ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఒకటి, రెండో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆర్‌బీడీ ప్రొటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్‌ను కంపెనీ తయారు చేసిందని, రాబోయే కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లకు అనుమతి లభించగా.. పంపిణీ కొనసాగుతోంది. జూలై నాటికి రోజుకు కోటి మోతాదులను పంపిణీ చేయాలని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు విదేశీ టీకా కంపెనీలైన ఫైజర్, మోడెర్నాతో సైతం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.