హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచివున్న ఉగ్ర వ్యూహంపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో అశాంతిని నెలకొల్పే క్రమంలో విధ్వంసాలకు పాల్పడాలన్న కుట్రలు తాజాగా బహిర్గతం కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి హోంమంత్రిత్వశాఖ కీలక బాద్యతలు అప్పగించింది. అవసరమైతే సైన్యం మద్దతు తీసుకోవాలని దేశాలిచ్చింది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభమైనట్లు దర్యాప్తులో దృవీకరించడంతో మూలాలపై అన్వేషణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో అనన్‌ఇ కోణాల్లో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు త్వరలోనే హైదరాబాద్ పాతబస్తీని అనువనువునా జల్లెడ పట్టేందుకు చర్యలకు ఉపక్రమించనున్నారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల వ్యాపారులు, గ్యాంగ్‌స్టర్ వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ తెలంగాణాతో పాటు 6 రాష్ట్రాల్లో దాడులు వేగవంతం చేసింది.
గ్యాంగ్‌స్టర్-ఖలిస్తానీ -టె-ర్రర్ లింక్‌పై ఎన్‌ఐఏ బుధవారం తెల్లవారుజాము నుంచి దాడులు మొదలయ్యాయి. ఎన్‌ఐఏ గుర్తించిన ఆరు రాష్ట్రాల్లోని ప్రత్యేక ప్రాంతాల్లో 100కి పైగా చోట్ల సోదాలు నిరంతరం జరుగుతున్నాయి. గ్యాంగ్‌స్టర్లు, ఖలిస్తానీ నెట్‌వర్క్‌పై నమోదైన 5 కేసుల్లో ఈ సంస్థ వేగంగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల ఎన్‌ఐఏ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. అయితే దేశ భద్రత దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. క్రిమినల్ ఇమేజ్, ఖలిస్తానీ ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు చేసిందని వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఉగ్ర దాడులకు రహస్యంగా కుట్ర జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణాతో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఎంపిక చేసిన ప్రాంతాల్లో అత్యంత గోప్యంగా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో కూడా 32 చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది. పంజాబ్, చండీగఢ్‌లలో 67 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 3 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.
యూపీలోని ప్రతాప్‌గఢ్, బరేలీ, లఖింపూర్‌లో కూడా ఈ దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది కాకుండా, రాజస్థాన్, హర్యానాలోని 18 చోట్ల కేంద్ర ఏజెన్సీ శోధన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని రెండు చోట్ల కూడా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.