ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : పెట్టుబడి దారుల చేతిలో కేంద్రం కీలుబొమ్మగా మారిందని, ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను విభజించే కుట్రలకు భాజపా తెర లేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మన ఉత్పత్తులు- మన గౌరవం విక్రయశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనతరం విలేకరులతో మాట్లాడుతూ… దేశంలో మతం పేరుతో మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా బరి తెగించిందని ఆయన మండిపడ్డారు. మధ్యయుగం నాటి సంస్కృతిని తెరమీదకు తెచ్చేందుకు ప్రధాని మోడీ, అమిత్ షాలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థి యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. పెట్టుబడిదారుల చేతిలో కేంద్రం కీలు బొమ్మల్లా మారిందని, దేశ సంపదను కొల్లగొట్టి పెట్టుబడి దారులకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పెట్టుబడిదారులకే దేశాన్నే తాకట్టు పెట్టిన చరిత్ర మోడీదని చెప్పారు.
దేశానికి గొప్ప చైతన్యం కలిగించిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం పురుడు పోసుకుంది ఈ ప్రాంతంలోనేనని గుర్తుచేశారు. రైతాంగమే ఆయుధాలు చేత బట్టి పోరాటం చేసిన గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతమని, భాజపా దుర్మార్గాలకు ముగింపు పలకకపోతే అటువంటి పోరాటం మళ్లీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. మోడీ పాలనతో 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిందని, చేతగాని తనంతో దేశంలో 35శాతం మంది ప్రజలకు కనీసం తినడానికి తిండి దొరకడం లేదన్నారు. ప్రపంచ దేశాల ముందు మోడీ పరువు తీశాడని చెప్పారు. మతాల పేరుతో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం అలవాటు అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపా ఆటలు సాగవని, రానున్న ఎన్నికల్లో 3 ఎమ్మెల్యే సీట్లు రావని చెబుతూ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు. ఈ సమావేశంలోప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాధరి కిశోర్ కుమార్, ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, అమరేందర్, అనురాధ, బీరుమల్లయ్య, నిర్మల, రాఘవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.