Wednesday, November 20, 2024

కేంద్రం ఆధీనంలో మ‌ణిపూర్…. అదుపులో శాంతిభ‌ద్ర‌త‌లు..

ఇంపాల్‌: మణిపూర్‌లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఆర్టికల్‌ 355ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చిందని మణిపూర్‌ డీజీపీ పీ దౌంగేల్ తెలిపారు. రాజ్యాంగంలోని అత్యవసరమైన ఆర్టికల్స్‌లో ఆర్టికల్‌ 355 ఒకటి. ఏదేనీ రాష్ట్రంలో అంతర్గత అల్లకల్లో లాలు సంభవించినప్పుడు, వెలుపలి నుంచి దాడులు జరుగుతున్నప్పుడు సదరు రాష్ట్రాన్ని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్‌ 355 అందిస్తుంది. మీడియాతో డీజీపీ మాట్లాడుతూ బిష్ణుపూర్‌ జిల్లాలోని ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి కొందరు దుండగులు ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని అపహరించుకుపోయారని, వాటిని తిరిగి అప్పగించని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకుం టామని దుండగులను హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థి తి ఒకటి లేదా రెండు రోజుల్లో అదుపులోకి వస్తుందని తాము అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆర్మీ, అసోమ్‌ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు వరుసగా నాలుగో రోజైన శనివారం కూడా సమస్యాత్మక జిల్లాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని బలగాల మధ్య సమన్వయం కారణంగా రాష్ట్రంలో అనేక చోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు.

”భారతీయ వైమానిక దళం సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌, ఏఎన్‌- 32 విమానాల ద్వారా అసోం రాష్ట్రంలోని వైమానిక స్థావరాల నుంచి అదనంగా ఆర్మీ, పారామిలటరీ ట్రూప్‌లను మణిపూర్‌కు నిరంతరాయంగా తరలిస్తున్నది. బాధిత ప్రాంతాల నుంచి అన్ని సామాజిక వర్గాల కు చెందిన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం రాత్రి వేళలయందు కూడా కొనసాగుతున్న ది” అని ఆర్మీ పీఆర్‌వో తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సాధారణ పరిస్థితి ని నెలకొల్పడం కోసం ఓవరాల్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్‌) అశుతోష్‌ సిన్హాను మణిపూర్‌ ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో 23 పోలీసు స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, సదరు పోలీస్‌ స్టేషన్ల వద్ద ఆర్మీ, కేంద్రీయ, పారామిలటరీ బలగా లు మోహరించాయని సిన్హా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో చిక్కుకున్న వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 20,000 మందికి పైగా బాధిత ప్రజలను సురక్షి తంగా ప్రాంతాలకు తరలించినట్టు ఆయన చెప్పారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా సహాయం అవసరమైతే సమీప పోలీస్‌ స్టేషన్లను లేదా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, సీఆర్‌పీఎఫ్‌ మాజీ అధినేత కుల్‌దీప్‌ సింగ్‌ మణిపూర్‌ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు.

హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయిన మణిపూర్‌ లో వేర్వేరు భద్రతా బలగాల మోహరింపులను సమన్వ య పరిచే బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఐదుగురు డీఐజీ స్థాయి అధికారులు, ఏడుగురు సీనియర్‌ ఎస్‌పీ, ఎస్‌పీ స్థాయి అధికారులకు అప్పగించారు. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో పరిస్థితి ని నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని మణిపూర్‌ హోమ్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కేంద్ర హోమ్‌ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో అమిత్‌ షా గురువారం నుంచి ఇప్పటివరకు రెండు సార్లు వీడియో కాన్ఫరెన్సు జరిపారని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితిపై, అక్కడ నివసిస్తున్న విద్యార్థుల బాగోగుల గురించి ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా అమిత్‌ షా మాట్లాడారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement