ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి రాలేదని పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్ర మంత్రి తుడూపై ..రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజనులను అవమాన పరిచిన కేంద్రప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లు రాలేదని చెప్పి గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించారని, బీజేపీ అబద్ధపు ప్రచారాలు, తప్పుడు ప్రకటనలు వాట్సప్ యూనివర్సిటీ నుంచి పార్లమెంట్ వరకు విస్తరించాయని మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే కేంద్రమంత్రి అవగాహన లేకుండా సోయితప్పి మాట్లాడారని బిజెపి మోసాలను గిరిజన సమాజం గమనించాలన్నారు. కనీస అవగాహన లేని మంత్రిని గిరిజన మంత్రిగా పెట్టడం గిరిజనులను అవమానించడమేనని అలాంటి వ్యక్తిని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయించిన చెల్లప్ప కమిషన్‌ను నియమించారని ఈ కమిషన్ అధ్యయన అనంతరం గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిని ఉన్నతీకరించడానికి 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తే రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రూపొందించిందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీ ఆమోదాన్ని పొంది అదే నెల 29న కేంద్ర హోంశాఖకు పంపారని బిల్లు తమకు చేరిందని కేంద్రం స్వయంగా ఒప్పుకొన్నదని అన్నారు. తండాలను ఆదివాసి గూడేలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసిఆర్, తెరాస ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల కోసం ప్రధానికి సీఎం కేసిఆర్ ఎన్నో లేఖలు రాశారని గుర్తు చేశారు. ఇంత జరిగిన తర్వాత అసలు ప్రతిపాదనలు, బిల్లే రాలేదనడం గిరిజనుల మనోభావాలను దెబ్బతీయడమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.