నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారమే ఆమెను కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన కొన్ని కీలక సమాచారం మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా ఎన్‌ఎస్‌ఈ మరో మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవి నరేన్, మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌లపై లుకౌట్ సర్క్యూలర్‌లను జారీ చేశారు. వారిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అన్ని విమానాశ్రయాలకు సమాచారం
దేశంలోని వివిధ విమానాశ్రయాలకు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా సీబీఐ అధికారులు చేరవేశారు. ఇదే కేసులో ఓపీజీ సెక్యూరిటీస్ ప్రమోటర్స్ సంజయ్ గుప్తాతో పాటు పలువురిపై సీబీఐ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. చిత్రా రామకృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన సందర్భంగా ఆమె ఇచ్చిన సమాచారాన్ని అధికారులు రికార్డు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. చిత్రా రామకృష్ణన్ తన హయాంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేయడం, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డును సైతం తప్పుదారి పట్టించేలా వ్యవహరించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆమె ఓ యోగి సూచనలు, సలహాలను పాటించారని చెబుతున్నారు.
యోగికి ఎన్‌ఎస్‌ఈ కీలక డేటా
ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు వచ్చే సమాచారాన్ని, వాటికి సంబధించిన డేటాను.. ఆ హిమాలయ యోగి ఇచ్చిన సూచనల మేరకు ఎంపిక చేసిన వారికి లీక్ చేశారని సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ అవినీతి వ్యవహారంలో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పాత్ర కూడా ఉందని సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. రామకృష్ణ, సుబ్రమణియన్ నివాసాల్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే సీబీఐ అధికారులు చిత్రా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కొందరికి మాత్రమే లబ్ది కలిగించేలా ఆమె వ్యవహరించినట్టు ఈ సోదాల సందర్భంగా పక్కా సమాచారాన్ని సేకరించినట్టు చెబుతున్నారు.