అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుండి కస్టడీలోకి తీసుకుంది. అవినీతి కేసులో తన కస్టడీని కోరుతూ సీబీఐ దరఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం అనుమతించడాన్ని దేశ్‌ముఖ్ సవాలు చేశారు. అయితే, బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిషన్‌ను తిరస్కరించింది. జస్టిస్ రేవతి మోహితే డేరేతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బుధవారం దేశ్‌ముఖ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. సీబీఐ కేసులో ఇద్దరు నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా బాంబో హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్ ఉద్దేశపూర్వకంగానే కస్టడీని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
కాగా, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం వీర్ సింగ్ అప్పటి హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ 100 కోట్లు వసూలు చేయాలని పోలీస్ అధికారులకు దేశ్‌ముఖ్ టార్గెట్ విధించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించడంతో గత ఏడాది ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.