Monday, November 25, 2024

అవినీతి కేసులో మాజీ హోంమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు

అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ​పై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వంద కోట్ల వసూళ్ల టార్గెట్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో విచారణలో భాగంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో, కొందరు ప్రముఖుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.  దేశ్ ముఖ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి తగిన సమాచారాన్ని విచారణలో తాము సేకరించామని సీబీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోందని చెప్పారు.

కాగా, అనిల్ దేశ్ ముఖ్ నెలకు వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన ఆరోపణలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని సీబీఐని బాంబే హైకోర్టు ఆదేశించింది. అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement