Wednesday, November 20, 2024

విద్యార్థిని సూసైడ్​పై సీబీఐ విచార‌ణే క‌రెక్ట్‌.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు స్టూడెంట్ సూసైడ్‌ కేసును సీబీఐ విచారణకు మార్చాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు డీజీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. అయితే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవద్దని, సీబీఐ విచార‌ణే క‌రెక్ట్ అని పోలీసుల‌కు సుప్రీంకోర్టు తెలిపింది.

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న రేపిన తంజావూరు బాలిక ఆత్మహత్య కేసు విచార‌ణ‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మార్చాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవ్వాల (సోమ‌వారం ఫిబ్ర‌వ‌రి14) సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై స్పందిస్తూ.. తంజావూరు బాలిక ఆత్మహత్య కేసును సీబీఐ విచారించ‌డ‌మే స‌రైన ప‌ద్ద‌తి అనీ, మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స‌మ‌ర్థించింది. ఈ మేర‌కు ఈ కేసులోని అన్ని సాక్ష్యాలను సీబీఐకి అందజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేర‌కు తమిళనాడు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

ప్రకటనలో ఈ కేసును ప్రతిష్టాత్మక అంశంగా మార్చవద్దని త‌మిళ‌నాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకు సేకరించిన అన్ని సాక్ష్యాలను సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం తమిళనాడు పోలీసులను కోరింది. బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై కూడా సీబీఐ విచారణ జరపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటీసును 4 వారాల్లో వాపసు చేయవచ్చని, ఏదైనా కౌంటర్ అఫిడవిట్, రిజాయిండర్‌ను 2 వారాల్లోగా దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

అస‌లు తంజావూరులో ఏం జరిగిందంటే..
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి చెందిన విద్యార్థిని సేక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. ఆ విద్యార్థిని జనవరి 9వ తేదీని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ను శుభ్రం చేయాలని, మెయింటెనెన్స్‌ పనులు చేయాలని హాస్టల్‌ వార్డెన్‌ తనను బలవంతం చేశారని ఓ వీడియోలో బాలిక ఆరోపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న చ‌నిపోయింది. మ‌రోవైపు .. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు.. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు ఆరోపించారు. అయితే.. తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ యాజమాన్యం వివ‌ర‌ణ‌లో తెలిపింది.

ఈ ఘ‌ట‌న‌పై విచారణ జరిపించాలని, బాధ్యులను శిక్షించాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరడంతో ఈ ఆరోపణలు రాజకీయ మలుపు తిరిగాయి. జువైనల్‌ చట్టం కింద ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలతో హాస్టల్‌ వార్డెన్‌ను అరెస్టు చేశారు. అయితే ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తున‌కు అప్ప‌గించాల‌ని జనవరి 31న మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కానీ.. మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు డీజీపీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బేల త్రివేదిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement