ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) వేగవంతం చేసింది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 51వ రోజు విచారణ కొనసాగిస్తోంది. మంగళవారం సీబీఐ అధికారులు ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ తో పాటు తిరుపతికి చెందిన డాక్టర్ సతీశ్ కుమార్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు.
గత కొన్ని రోజులుగా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలోనే సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల పర్యవేక్షణ అధికారిని మారుస్తూ సీబీఐ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసు డీఐజీ సుధాసింగ్ నుంచి ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ అయింది. మరోవైపు ఈ కేసులో వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన కీలకం మారింది.
కేసును విచారించేందుకు కొత్తగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రామ్ కుమార్ ఇప్పటికే కడపకు చేరుకున్నారు. మొన్నటి వరకు డీఐజీ సుధాసింగ్ 49 రోజులపాటుగా కేసులోని అనుమానితులను విచారించారు. వాచ్మెన్ రంగన్న రెండు రోజుల కిందట కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. అంతకంటే ఒకరోజు ముందే సీబీఐ డీఐజీ సుధాసింగ్‌ను తిరిగి విజయవాడకు పంపించారు. ఆమె స్థానంలోనే తాజాగా రామ్ కుమార్‌ను నియమించారు. రంగన్న వాంగ్మూలాన్ని కీలక పరిణామంగా భావిస్తున్న సమయంలో.. కొత్త అధికారి రావటం ఆసక్తిని రేపుతోంది. మరోవైపు రేపట్నుంచే కేసులోని కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. సుధాసింగ్ నేతృత్వంలోనే విచారణ కనసాగనుంది.
కొద్దిరోజుల కిందట మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షణ అధికారిని ఉన్నతాధికారులు మార్చారు. సీబీఐలో డీఐజీ ర్యాంకు హోదాలో దాదాపు ఏడాది నుంచి వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సుధాసింగ్‌ను తప్పించారు. ఇప్పటికే కేసులో పలువురు కీలక అనుమానితులను కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి పిలిపించి విచారించారు. ఈ దర్యాప్తు విచారణకు ఆమెనే నేతృత్వం వహించారు.
మరోవైపు ఈ కేసులో 23వ తేదీన 11 నుంచి 12 గంటల మధ్యలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఫకృద్ధీన్ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మెజిస్ట్రేట్… రంగన్న మినహా మిగిలిన వారెవ్వరూ లేకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రంగన్నను సీబీఐ అధికారులు కడపకు తీసుకొచ్చారు. తాజాగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రంగంలోకి దిగటంతో ఆసక్తిని రేపుతోంది.
ఇది కూడా చదవండి: గులాబీ గూటికి పెద్దిరెడ్డి… టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటన!