Tuesday, November 26, 2024

సీబీఐ తనపని తాను చేస్తుంది, దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అవసరం: సీజేఐ ఎన్‌వీ రమణ

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) చర్యలు, నిష్క్రియాత్మకతలు తరచూ దాని సామర్థ్యం, విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తుంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. అవినీతి ఆరోపణలతో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతోంది. అధికార మార్పిడితో వేధింపులకు గురవుతునన్నామంటూ తరచూ పోలీసు అధికారులు మా వద్దకు వస్తుంటారు. కాలంతోపాటు రాజకీయ అధికారులు మారుతుంటారు.. కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని సీజేఐ పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐ తనపని తాను చేసుకుపోతోందని,ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నదని తెలిపారు. సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్‌ డి.పి.కో#్లహ 19వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. శుక్రవారం విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ”ప్రజాస్వామ్యం- దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు” అంశంపై సీజేఐ ప్రసంగించారు. సామాజిక చట్టబద్ధత, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం ఈ సమయంలో చాలా అవసరమని నొక్కిచెప్పారు. ఈ క్రమంలో రాజకీయ, కార్యనిర్వాహక సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మొదటి అడుగుగా సూచించారు. సీబీఐ వంటి ఏజెన్సీలను ఒకే తాటిపైకి తీసుకురాగల గొడుగు లాంటి స్వయంప్రతిపత్తి సంస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. బ్రిటీష్‌ కాలం నుంచి దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, పోలీసు విధి నిర్వ#హణ కత్తిమీద సాములాంటిదని.. పోలీసు అధికారాలను రాజకీయ నాయకులు దుర్వినియోగం చేయడం ఎప్పటినుంచో ఉందని తెలిపారు.

పోలీసు శిక్షణ తీరు మారాలి..

విశ్వసనీయతలో జాతీయ సంస్థల కంటే పోలీసులు వెనకబడుతున్నారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం అత్యవసరం. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడాలి. అందుకోసం పోలీసుల శిక్షణ తీరులో మార్పు రావాలి. చాలా వరకు నేరవిచారణ రాష్ట్రాల పరిధిలోనే జరుగుతుంది. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం. ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ ఉండాలి. ప్రాసిక్యూషన్‌, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి. ఏటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలి. శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశం.

సవాళ్లూ ఉన్నాయి..

దర్యాప్తు సంస్థలు ఎదుర్కొంటున్న ఇతర సవాళ్లను వివరిస్తూ, వారికి మౌలిక సదుపాయాల కొరత, మానవశక్తి, ఆధునిక పరికరాలు, సాక్ష్యాలను సేకరించే సందేహాస్పద సాధనాలు, రాజకీయ నిర్వాహక మార్పులతో ప్రాధాన్యతలలో మార్పులు, పదేపదే అధికారుల బదలీలు వంటి సమస్యలున్నాయని తెలిపారు. ఈ సమస్యలు తరచుగా దోషులను నిర్దోషులుగా, నిర్దోషులను నిర్బంధించే పరిస్థితులకు దారితీస్తుంటాయని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని కోర్టులు అడుగడుగునా పర్యవేక్షించడం సాధ్యంకాదన్నారు. కేవలం కొంత మంది అధికారులు మాత్రమే మార్పు తీసుకురాగలని చెప్పారు.

- Advertisement -

ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం వద్దు..

ఇది 75 ఏళ్ల స్వతంత్ర భారత సందర్భం. భారతీయులందరం మన స్వేచ్ఛను మనం ప్రేమిస్తాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలోనే మన స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం చెప్పిన ప్రజాస్వామ్య విధానం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరూ చూడకూడదు. నేరాల నిరోధానికి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రజల నమ్మకాన్ని చూరగొనడమే పోలీసుల తక్షణ కర్తవ్యం. ఆరంభ దశల్లో సీబీఐపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉండేది. నిష్పాక్షికత, స్వతంత్రత విషయంలో సీబీఐ ప్రతీకగా నిలిచేది. న్యాయం కోసం బాధితులు సీబీఐ వైపే చేసేవారు. కాలక్రమంలో తన చర్యల ద్వారా సీబీఐ చర్చల్లో నిలిచింది. విలువలు, నైతికతకు కట్టుబడి ఉంటే ఎవరూ మిమ్మల్ని అడ్డగించలేరు. మంచి నాయకుడు ఉంటే ఆ సంస్థకు మంచి పేరు తీసుకురావచ్చు అని సీజేఐ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement