జార్ఖండ్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్యపై దర్యాప్తు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కొత్త అధికారుల బృందాన్ని నియమించింది. కేసు విచారణకు సంబంధించి జార్ఖండ్ హైకోర్టు పదేపదే అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులలో ఈ మార్పు చేపట్టాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలిపారు. నాలుగు నెలల వ్యవధిలో అనుమానితులకు రెండుసార్లు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు ఎందుకు నిర్వహించారో వివరించాలని హైకోర్టు తన చివరి విచారణలో సీబీఐ అధికారులను కోరింది.
సీబీఐ కొత్త దర్యాప్తు బృందానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) ర్యాంక్ అధికారి వికాస్ కుమార్ నాయకత్వం వహిస్తారని అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అతను ప్రస్తుతం దేశ రాజధానిలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్ -2లో ఉన్నారు. గతంలో ఉన్న దర్యాప్తు అధికారి ఏఎస్పీ అజయ్ శుక్లా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. జైలులో ఉన్న రాహుల్ వర్మ, లఖన్ వర్మలను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కొత్త బృందం కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం జనవరి 29 నుంచి జనవరి 31 వరకు ఇరువురిని ప్రశ్నించేందుకు అనుమతిని మంజూరు చేసింది.
సీబీఐ తన చార్జిషీట్‌లో ఆటో రిక్షా డ్రైవర్లు లఖన్ వర్మ, రాహుల్ వర్మపై IPC 302 (హత్య), 201 (తప్పుడు సమాచారం ఇవ్వడం) 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద అభియోగాలు మోపింది. జడ్జి ఆనంద్ హత్యపై విచారణకు జార్ఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) లఖన్ వర్మ, రాహుల్ వర్మను మొదట అరెస్టు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకుంది.
మరోసారి నేరస్థలాన్ని సందర్శించనున్న కొత్త టీమ్..
గత ఏడాది జూలై 28న ధన్‌బాద్ జిల్లా జడ్జి మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగా ఆటో రిక్షా అతడిని ఢీకొట్టిందని గతంలో సీబీఐ కోర్టుకు తెలిపింది. స్థానిక మాఫియాతో కూడిన సెన్సిటివ్ కేసులలో తీర్పులు ఇవ్వడం వల్లే ఆయన హత్యకు గురయ్యారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దర్యాప్తు సమయంలో సీబీఐ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించింది. గాంధీనగర్, ముంబై, ఢిల్లీ నుండి నాలుగు వేర్వేరు ఫోరెన్సిక్ బృందాల ద్వారా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది. కాగా, ఆయన మృతికి గల కారణాలపై ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలన్నీ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్యకు గురయ్యారనే విషయాలను స్పష్టం చేస్తున్నాయి.