ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (RRR)ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీఎం పదవిలో ఉన్న జగన్.. తన ఆస్తుల కేసుకు సంబంధించిన ఆధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆయనకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ప్రమోషన్లు కూడా ఇస్తున్నారని, సీబీఐ ఇప్పటికే 11 ఛార్జిషీట్లు దాఖలు చేయగా అన్నింటిలోనూ ఆయన A1గా ఉన్నారని పిటిషనర్ వాదనలు వినిపించారు. గతంలో జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
అటు ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హత కలిగి ఉందా, లేదా అన్న అంశంపై ఈనెల 27న తీర్పు వెల్లడించనుంది. దీంతో ఆరోజు కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలనే ఈ పిటిషన్ వేసినట్టు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమన్నారు. కాగా అధికారిక పనుల పేరుతో వారం వారం కోర్టు విచారణకు హాజరుకాకుండా జగన్ తప్పించుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు గతంలో విమర్శలు చేయడం గమనార్హం.