సీబీఐ, ఈడీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆ రాష్ట్రంలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ప్రచారం చేసేందుకు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా బీజేపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీబీఐ, ఈడీలు అరెస్టు చేసిన వారిలో 95 శాతం మంది విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులే ఉన్నారని చెప్పారు.
బీజేపీ నేతలకు అధికార గర్వం తలకెక్కిందంటూ చిదంబరం విరుచుకపడ్డారు. 135 మంది ప్రాణాలను బలితీసుకున్న గుజరాత్‌లోని మోర్బి కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనకు బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎవరూ క్షమాపణ చెప్పలేదన్నారు. ఈ ఘటనకు బాధ్యతవహిస్తూ బీజేపీ పాలకులు ఎవరూ రాజీనామా చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ గర్వానికి ఇది పరాకాష్ఠగా ధ్వజమెత్తారు.