న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వైరస్.. 30మ్యూటేషన్‌లతో విరుచుకుపడుతోందని, ప్రతీ ఒక్కరు రెండు డోసులు వేసుకుని రక్షణ పొందాలని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడుతుండటంపై డబ్ల్యూహెచ్ఓ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రభ-ఇండియా ఎహెడ్ జాతీయ ఆంగ్ల న్యూస్ ఛానెల్‌తో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రత్యేకంగా మాట్లాడారు.
కొన్ని రోజుల నుంచి ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడుతోంది. బీ.1.1.529 వేరియంట్ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు శాస్ర్తవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 9వ తేదీన తొలి కేసు నమోదైంది. నాటి నుంచి నేటి వరకు 150కు పైగా ఒమిక్రాన్ కేసులు దక్షిణాఫ్రికాలో నమోదయ్యాయి. దీంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఊపందుకున్నాయి. రక్షణ చర్యలు తీసుకుంటోంది. హాంకాంగ్‌లో 2 కేసులు రికార్డయ్యాయి. ఆ తరువాత.. ఇతర దేశాలకు కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.
అన్ని వేరియంట్స్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఎంతో భిన్నంగా ఉంది. ఈ రకం వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుంది. అయితే ఎంత వేగం అనేది ఇంకా సరిగ్గా నిర్ధారించలేం. అదేవిధంగా మనిషి శరీరంలో ఈ వైరస్ లోనికి ప్రవేశించిన తరువాత.. యాంటీ బాడీలను ఎలా నాశనం చేస్తుందో కూడా స్పష్టమైన విషయాల్లేవు. అయితే దీనిపై శాస్ర్తవేత్తలు పని చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలి. డెల్టా వేరియంట్ కంటే ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నాం.
దక్షిణాఫ్రికాలో ముందుగా చాలా తక్కువగా కేసులు నమోదయ్యాయి. మళ్లీ నవంబర్ నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో శాస్ర్తవేత్తలు లోతుగా పరీక్షించగా.. బీ.1.1.529 వేరియంట్ ముందుకు వచ్చింది.దాన్ని ఒమిక్రాన్‌గా పిలుస్తున్నాం. ప్రతీ ఒక్కరు ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.