గ్రామీణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఓ చిరుత అటవీశాఖ అధికారులను సైతం ముప్పతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకునేందుకు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. చిరుత కోసం బోను ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. మేక, లేదా గొర్రెను ఎరగా వేసినా అది తెలివిగా తప్పించుకుంటోంది. రంగారెడ్డి జిల్లా తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల పరిధిలో బోన్లు ఏర్పాటు చేసినా చిరుత మాత్రం చిక్కడం లేదు.. దగ్గర వరకు వచ్చి చూసి వెళ్లిపోతోంది తప్పిస్తే అందులోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు.. బోన్లకు చిక్కకపోవడంతో జూ అధికారుల సహాయంతో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి పట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి: కొన్ని నెలలుగా ప్రజలను, అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత బోన్లకు చిక్కడం లేదు. గతంలో ఎన్నోసార్లు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఈసారి మాత్రం అంతగా విజయం సాధించలేకపోతున్నారు. బోన్లు ఏర్పాటు చేసినా చిరుత మాత్రం చిక్కడం లేదు. గతంలో మొయినాబాద్ మృగవాని జింకల పార్కులో మూడుసార్లు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. నీటి కుంటల వద్ద బోన్లు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. నీళ్లు తాగేందుకు వచ్చి మేకలను తినే ప్రయత్నంలో బోన్లలో చిక్కుకుపోయి పట్టుబడ్డాయి. అదే తరహాలో యాచారం మండలం తాటిపర్తిలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. బోన్ల వరకు వచ్చి అపాయాన్ని చిరుత పసిగడుతున్నట్లు తెలుస్తోంది. బోన్ల దగ్గరికి వెళ్లి వెనక్కి వచ్చేస్తోంది. చాలా తెలివిగా చిరుత వ్యవహరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో బోన్ల సహాయంతో ఎన్నో చిరుతలను పట్టుకునే శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ యాచారంలో మాత్రం బోన్ల ప్రయోగం అంతా సక్సెస్ కావడం లేదు.
తాటిపర్తి పరిసర ప్రాంతాల్లోనే సంచారం..
తాటిపర్తి పరిసర ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతంలోనే వరుస దాడులు చేస్తున్నందునా ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల మూడు ప్రాంతాల్లో చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. గతంలో కుర్మిద్ద, నానక్‌నగర్, మేడిపల్లి, కడ్తాల్, ఆమన్‌గల్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. మైసిగండి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డు కూడా అయ్యింది. ప్రస్తుతం మాత్రం తాటిపర్తి అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్న అటవీ రేంజ్ ఆఫీసర్ నిఖిల్‌రెడ్డి పేర్కొన్నారు.
జాతర తరువాత స్పెషల్ ఆపరేషన్…
తాటికుంట మైసమ్మ జాతర మూడురోజులపాటు కొనసాగనుంది. శుక్రవారం ప్రారంభమైన జాతర శని, ఆదివారం కొనసాగనుంది. జాతర నేపథ్యంలో జన సంచారం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చిరుత అక్కడికి వచ్చే అవకాశాలు లేవని అటవీశాఖ భావిస్తోంది. ఐనా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మూడురోజుల్లో జాతర ముగిసిన తరువాత స్పెషల్ ఆపరేషన్ చేపట్టనున్నారు. జూ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. ప్రత్యేక తర్ఫీదు పొందిన జూ అధికారుల సహాయంతో చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయనున్నారు.
ముందుగా సీసీ కెమెరాల సహాయంతో చిరుత కదలికలను పసిగట్టనున్నారు. తాటిపర్తి పరిసర ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తున్నట్లు ఇప్పటికే అటవీశాఖ అధికారులు నిర్దారణకు వచ్చినందునా ఆ ప్రాంతంలోనే నిఘా పెట్టనున్నారు.మత్తు ఇంజెక్షన్ల సహాయంతో చిరుతను పట్టుకోనున్నారు. తాటికుంట మైసమ్మ జాతర ఉన్నందునా జన సంచారం ఎక్కువగాఉంటుంది. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి చిరుత పారిపోయే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద స్పెషల్ ఆపరేషన్ ద్వారా చిరుతను పట్టుకునే ప్రయత్నంలో అటవీశాఖ అధికారులు ఉన్నారు. ఇందులో ఎంతమేర విజయం సాధిస్తారో వేచి చూడాలి..