తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వందలాది మంది విద్యార్థులకు కరోనా సోకిందనే వార్త అటు తల్లిదండ్రులను, ఇటు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు ఎంతవరకు సేఫ్ అనే సందేహం వ్యక్తమవుతోంది. దాదాపు 170 మందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడినట్లు సమాచారం అందుతోంది.
ఇప్పటివరకు పరిశీలిస్తే ఏపీలోని తిరుమల వేద పాఠశాలలో 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతేకాకుండా కర్నూలు జిల్లా పత్తికొండలోని ఓ ప్రైవేట్ స్కూలులో ఇద్దరు విద్యార్థులకు కరోనా అని తేలడంతో ఏకంగా స్కూల్‌ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అటు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు, కామారెడ్డి జిల్లాలోని టేక్రియాల్ కస్తూర్భా పాఠశాలలో 32 మందికి, నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీ గర్ల్స్ హైస్కూలులో 36 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.