హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్న వారు జాగ్రత్త. వెంటనే రెండో డోస్ తీసుకోకపోతే కొవిడ్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల బాధితుల్లో మీరు చేరడం ఖాయమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కరోనా రెండు డోస్‌ల తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడిన వారిన బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కేసులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఇటీవల హైదరా బాద్‌లోని పలు ప్రైవేటే, ప్రభుత్వ ఆస్పత్రులకు రోజూ 4 నుంచి 5 బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కేసులు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారే అధికమని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు పెరిగిపోవ డాన్ని గమనిస్తే రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోం ది.
ప్రస్తుతం తెలంగాణలో 38శాతం మంది మాత్రమే రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్ తీసుకు న్నారు. అదే మొదటి డోస్ తీసుకున్న వారి సంఖ్య 80 శాతం దాకా ఉంది. మొదటి, రెండో డోస్ తీసుకున్న వారి మధ్య ఇంత వ్యత్యాసం ఉండడం వైద్య, ఆరోగ్య శాఖవర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రెండో డోస్‌పై ప్రజల్లో నెలకొన్న నిర్లక్ష్యం మూడో వేవ్ కు కార ణమవుతుందన్న భయాందోళనలను వైద్య నిపు ణులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనలను నిజం చేస్తూ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కేసుల్లో ఎక్కువగా మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారే అధికంగా ఉండడం గమనార్హం.
బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్, అవయవమార్పిడి తది తర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో నూ చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరోవైపు ఏ వ్యాక్సిన్ అయినా 100శాతం పనిచేయదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి అని తేల్చి చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా.. అని కరోనా జాగ్రత్తలను నిర్లక్ష్యం చేస్తూ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బాధితుల్లో చేరడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. బ్రేక్ త్రూ కొవిడ్ బారిన పడిన వారిలో కొందరు రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నా… జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయడంతో 14 రోజుల్లోపల వైరస్ బారిన పడినట్లు తేలింది. ఇక వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే ప్రస్తుతం కొవిడ్ మరణాల రేటు ఎక్కువగా ఉంది.