Wednesday, November 20, 2024

Munugodu: కారును పోలిన గుర్తులు.. టీఆర్ ఎస్‌కు తగ్గిన మెజారిటీ

ఉమ్మడి నల్గొండ, ప్రభన్యూస్‌ బ్యూరో: మునుగోడులో అధికార గులాబీ పార్టీ మెజార్టీ మరింత వచ్చేది. టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా శ్రమించినా మెజార్టీ మాత్రం 10వేల పైచిలుకే వచ్చింది. ముందుగా వారు ఊహించుకున్న ప్రకారం 20వేల పైగానే వస్తుందని అంచనా వేశారు. కానీ 10వేల దగ్గర్లోనే లీడ్‌ ఆగిపోయింది. అసలు ఎందుకు జరిగింది? కారణాలేంటి? మెజార్టీ తగ్గడానికి ప్రతికూల పరిస్థితులను పరిశీలిస్తే కర్ణుడికి చావుకు సవాలక్ష కారణాలు అన్న చందంగా ఉంది. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎం ఓట్లు సుమారు 15వేల వరకు ఉన్నాయి. వాటిని చూసి ముందుగానే పసిగట్టిన గులాబీబాస్‌ వారితో పొత్తు పెట్టుకున్నారు.

అయితే కమ్యూనిష్టుల ఓట్లు కారుకు పడలేదన్నట్లుగా కనిపిస్తుంది. వారి 15వేల ఓట్లు పడితే టీఆర్‌ఎస్‌ మెజార్టీ 25వేలు దాటాలి. కానీ 10వేల దగ్గర్లోనే ఆగడం చూస్తుంటే కమ్యూనిస్టుల ఓట్లు చీలికపోయినట్లుగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే కారుగుర్తును పోలిన రోడ్డురోలర్‌, చపాతిరోలర్‌ గుర్తులు ప్రమాదకరంగా మారాయి. అన్ని ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఆ పరిస్థితి కనిపించింది. అభ్యర్థులెవరో తెలియకపోయినా వారికి పెద్దమొత్తంలో ఓట్లు వచ్చాయి. ఈవిఎం 12వ నెంబర్‌లో ఉన్న మారమోని శ్రీశైలంయాదవ్‌ చపాతిరోలర్‌కు 2407 ఓట్లు.. 14వ సంఖ్యలోని కె.శివకుమార్‌ రోడ్డురోలర్‌ గుర్తుకు 1874 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మూడు ఈవీఎంలను ఉపయోగించారు.

ఇది కూడా టీఆర్‌ఎస్‌కు శాపంగా మారింది. రెండో ఈవీఎంలోని రెండో సంఖ్యలో ఉన్న ఏర్పుల గాలయ్య చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి. మొదటి ఈవిఎంలో రెండవసంఖ్యలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారు గుర్తు ఉండటంతోనే అలా జరిగింది. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ గుర్తుకు పడాల్సినవే కానీ నిరక్షరాస్యులు, వృద్ధులకు తెలియక వేయడంతో టీఆర్‌ఎస్‌ మెజార్టీ తగ్గింది. టీఆర్‌ఎస్‌కు మెజార్టీ తగ్గడానికి ఈకారణాలేనని టిఆర్‌ఎస్‌ నేతలు చెపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement