ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో ఆతిథ్య జట్టు 222 పరుగులకు ఆలౌటయ్యింది. కెప్టెన్ తెంబ బవుమ (114 నాటౌట్ : 142 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి సహకరించేవాళ్లు కరువవ్వడంతో సఫారీ జట్టు కుప్పకూలింది. కంగారు జట్టు బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, స్టోయినిస్ రెండు వికెట్లు తీశారు.
ఇక.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ సఫారీలకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (11)ను స్టోయినిస్ ఔట్ చేశాడు. అక్కడితో మొదలు వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వాన్ డెర్ డస్సెన్(8), ఎయిడెన్ మరక్రం(19), క్లాసెన్(14) నిరాశ పరిచారు. ఆల్‌రౌండర్ మార్కో జాన్‌సెన్ ఒక్కడే 32 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత చివరి వికెట్‌గా వచ్చిన ఎంగిడితో కలిసి బవుమా పోరాడాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎంగిడిని హేజిల్‌వుడ్ బౌల్డ్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.