దేశంలో జీవనదులు ఉన్నా తాగు, సాగునీరందించని పాపం ఎవరిదని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు పలువురు మరాఠా యోధులకు ఆయన నివాళులర్పించారు. అనంతరం పార్టీలో పలువురు చేరగా.. గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు. అనంతరం కేసీఆర్ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
‘మహారాష్ట్ర పవిత్రభూమికి నమస్కారం. ముస్లిం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. బీఆర్‌ఎస్‌కు ఒక లక్ష్యం ఉంది. నా మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకండి. నా మాటలపై గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు, వీధిలో ఉన్న వారితో చర్చించండి. దేశంలో ఏం జరుగుతుందో గమనించాలి. దేశంలో ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా అనే విషయంపై చర్చ పెట్టాలి. లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా?’ అని ప్రశ్నించారు.
పెద్దపెద్ద మాటలు మాట్లాడే నేతలు తాగునీరు ఇవ్వలేరా?
‘ఇప్పటికీ ప్రజలకు సాగునీరు, తాగునీరుసరిగా అందడం లేదు. సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది?. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు. దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగేందుకు నీళ్లుండవా? పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా? ఇంటికి పంపాలా? ముంబయి దేశ ఆర్థిక రాజధాని. కానీ తాగేందుకు నీళ్లుండవా? తాగడానికి నీళ్లు దొరకని పాపానికి బాధ్యులెవరు. దేశం పురోగమిస్తుందా? తిరోగమిస్తుందా ఆలోచించండి. ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలా? చికిత్స చేయాలా? ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడుతాం. సమస్యలకు పరిష్కారం లభించకుంటే ఏం చేయాలి? ఇంకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా? తెలంగాణలో మంచి సమస్య లేకుండా చేశాం. అన్నివర్గాలకు సరైన న్యాయం దక్కాల్సిందే. భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారు. ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు. అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బీఆర్‌ఎస్ పుట్టింది. మార్పు వచ్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు. మనల్ని బాగు చేసేందుకు ఎవరో విదేశాల నుంచి రారు. దేశ భవిష్యత్ మీమేదే ఆధారపడి ఉంది’ అన్నారు.
అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇంటింటికీ తాగునీరు..
‘రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్వతంత్ర భారతావనిలో తాగేందుకు నీరు లేదు. యువతకు ఉద్యోగాల్లేవు. జనాభాకు కావాల్సిన దానికంటే రెట్టింపు నీరు పుష్కలంగా ఉంది. దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. సాగు యోగత్య ఉన్న భూములకు అందించాల్సి ఉంది. కానీ ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పని చేసే సామర్థ్యాలు లేవు. నిజాయితీగా మేం చేసే పోరాటానికి విజయవం తథ్యం. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ నీరు ఇస్తాం. మహారాష్ట్రలో ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరిస్తాం. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోరాటం ఆగదు. రైతులకు అన్నీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేస్తాం. బీఆర్‌ఎస్‌పై నమ్మకం ఉంచండి. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్‌ఎస్ ఆవిర్భవించలేదు’ అన్నారు.