Friday, November 22, 2024

Spl Story | ఈ ‘బండి’తో ముందుకెళ్లలేం.. సిక్స్​ పాయింట్స్​తో హైకమాండ్​కు ఈటల కంప్లెయింట్​!

బీజేపీలో లుకలుకలు బయటపడుతున్నాయా?.. విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయా?.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారా?.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో రాజకీయం వేడెక్కుతోంది. అంతర్గతంగా విబేధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బండి సంజయ్‌ను వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలన్న డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల దాకా తీసుకెళ్లినట్లు సోషల్​ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాటకలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘‘తమదే గెలుపు, దేశంలో ఎదురే లేదు’’ అనుకున్న ఆ పార్టీ పెద్దలకు కన్నడ పరాజయంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అక్కడ అతిపెద్ద షాక్ తర్వాత తెలంగాణలోనూ బీజేపీ అలర్ట్ అయ్యింది. అయితే.. ఇక్కడ కొద్దో గొప్పో వాయిస్ వినిపిస్తున్న లీడర్ల నడుమ విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల మద్దతును కూడగట్టడంలో బండి సంజయ్ ఫెయిల్​ అయ్యారని బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదులు అందుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పొలిటికల్​ అనలిస్టులు కూడా భావిస్తున్నారు.

- Advertisement -

ఇక.. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికల కోసం బీజేపీ హైకమాండ్ నియమించిన కమిటీకి ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఈ మధ్యనే ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిసినట్లు సమాచారం. ఈ భేటీలో బండి సంజయ్ నాయకత్వంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఈటల అమిత్ షాకు కంప్లెయింట్​ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో వర్గపోరు మరింత ప్రస్పుటంగా బయటపడ్డట్టు తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని అమిత్​షాకి ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బండి నాయకత్వంలో క్యాడర్ బలపడటం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ బలోపేతం కోసం ఈటల ఆరు పాయింట్లతో కూడిన సంస్కరణల ప్రతిపాదనలు అమిత్ షా ముందుంచినట్లు తెలుస్తోంది. ఇందులో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం అనే అంశం కూడా చేర్చినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక.. బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ప్రసంగించినా కేవలం హిందుత్వ అనే అంశం మాత్రమే తీసుకొస్తున్నారని, దీంతో ఇతరులు బీజేపీకి దగ్గర కాలేకపోతున్నారనే విషయాన్ని ఈటల రాజేందర్ హై కమాండ్​ ముందు పెట్టినట్టు సమాచారం. కర్నాటకలో హిందుత్వ మోడల్ పనిచేయలేదని.. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను మార్చి తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఈటల సూచించినట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద బీజేపీ హైకమాండ్ కూడా బండి సంజయ్‌తో చర్చించనున్నట్టు సమాచారం అందుతోంది.

అంతేకాకుండా రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇరత రాష్ట్రాల మాదిరిగా మతపరమైన రాజకీయాలు పనిచేయవన్న అభిప్రాయం ఈటల రాజేందర్​ వ్యక్తం చేసినట్టు సమాచారం. అదే జరిగితే కర్నాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయన్న విషయాన్ని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే కమలదళంలో చాలామంది అసంతృప్తితో ఉన్నారని, ఇది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే చాన్స్ ఉందని తన నివేదిక ద్వారా వెల్లడించినట్టు తెలుస్తోంది.

కాగా, పలువురు కమలం నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు కూడా తమకు సమాచారం ఉందని ఈటల అమిత్​షాతో జరిపిన భేటీలో వెల్లడించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్నికలకు ముందు పార్టీలో బండి సంజయ్​పై నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాయకులు మధ్య ఐక్యత లేకపోతే పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉంది..  దీంతో బండిని మార్చాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. నేతల్లో అసమ్మతి రగిలితే వారిని ఆపడం ఎవరి తరం కాదని బీజేపీకి తెలిసేలా ఈటల నివేదిక అందించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement