హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై లైంగిక వేధింపుల ఆరోపణలకు నిరసనగా 2014లో రాజీనామా చేసిన మహిళా న్యాయమూర్తిని సుప్రీంకోర్టు తిరిగి విధుల్లోకి తీసుకుంది. అప్పట్లో ఆమె చేసిన రాజీనామాను స్వచ్ఛందంగా పరిగణించలేమని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళా న్యాయమూర్తిని తిరిగి పదవిలో నియమించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇవ్వాల ఆదేశించింది. రాజీనామాకు ముందు ఆమె అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు.
కాగా, మహిళా జడ్జిని తిరిగి ఉద్యోగంలో తీసుకునేటప్పుడు ఆమెకు అంతకుముందు రోజుల్లోని వేతనాలను తిరిగి పొందే అర్హత లేదని, సేవలో కొనసాగింపునకు సంబంధించి అన్ని ప్రయోజనాలను పొందుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. 2014లో జరిగిన ఇన్సిడెంట్‌తో తనను బలవంతంగా రాజీనామా చేయించినందున తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆ మహిళ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 1న వెలువరించాల్సిన తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచింది.